Womens Day: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం (Indian Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో జరగబోయే ఉమెన్స్ డే (Womens Day) వేడుకలకు ప్రధాని (PM Narendra Modi) హాజరుకానున్న నేపథ్యంలో మహిళా పోలీసులతో ఆయనకు భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి అధికారికంగా వెల్లడించారు.ఒక ప్రధానికి ఇంత భారీ స్థాయిలో మహిళా సిబ్బంది సెక్యూరిటీ కల్పించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.
ప్రధాని రక్షణ బాధ్యత మహిళలదే
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుజరాత్ లో కేంద్రం ప్రభుత్వం ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుజరాత్ (Gujarat)లోని నవ్ సారీ (Navsari) జిల్లాలో ఉమెన్స్ డే కార్యక్రానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) హాజరుకానున్నారు. అయితే ప్రధాని పాల్గొనే ఉమెన్స్ డే ఈవెంట్ కు మహిళా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి (Harsh Sanghavi) తెలిపారు. ప్రధాని దిగే హెలిప్యాడ్ నుంచి వేదిక వరకూ భద్రతా ఏర్పాట్లను మహిళా సిబ్బందే చూసుకుంటారని ఆయన వెల్లడించారు.
2,300 మంది మహిళలతో పహారా
ఉమెన్స్ కార్యక్రమానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. 2,300 మందికి పైగా మహిళా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుళ్ల వరకూ అందరూ మహిళా పోలీసులే ఉండనున్నట్లు తెలిపారు. మెుత్తం భద్రతా సిబ్బందిలో 2,100 మందికిపైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది సీఐలు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ఉంటారని హోంమంత్రి వివరించారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోంశాఖ కార్యదర్శి నిపుణా తోరావణే ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు హోంమంత్రి చెప్పారు.
Also Read: SpaceX’s Starship Explodes: ఆకాశంలో భారీ పేలుడు.. భూమిపైకి దూసుకొచ్చిన శకలాలు
లక్షన్నర మంది మహిళలు హాజరు
అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా ‘లక్ పతి దీదీ’ (Lakhpati Didi Yojana) పేరుతో ప్రభుత్వం ఈ వేడుకను నిర్వహించనుంది. నవ్ సారీ (Navsari) జిల్లాలో ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమానికి దాదాపు లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా 2023లో కేంద్రం ప్రారంభించిన ‘లక్ పతి దీదీ యోజన’ పథకం కింద రూ.450 కోట్ల నిధులను ఈ వేదికపై పీఎం నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. రెండున్నర లక్షల మంది మహిళలు భాగస్వామ్యంగా ఉన్న 25,000లకు పైగా సెల్ప్ హెల్ప్ గ్రూప్ (SHG)కు ఈ నిధులతో లబ్ది చేకూరనుంది. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎంతో భూపేంద్ర పటేల్ తో పాటు పలువురు మంత్రులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు.