Bangladesh: ‘ఇంక్విలాబ్ మంచా’ పేరిట విద్యార్థి సంఘాన్ని స్థాపించిన ఉస్మాన్ హదీ అనే వ్యక్తి హత్యకు గురికావడం బంగ్లాదేశ్‌ను (Bangladesh) అగ్నిగుండంగా మార్చిన విషయం తెలిసిందే. తీవ్ర నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్న మన పొరుగుదేశంలో సోమవారం నాడు మరో అనూహ్య పరిణామం జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి (NCP) చెందిన మరో విద్యార్థి నేత ముహమ్మద్ మోతలేబ్ సిక్దర్‌పై కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో ముహమ్మద్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రమైన గాయం అయ్యింది. దీంతో, అతడికి చికిత్స కొనసాగుతోంది. ముహమ్మద్ తలలో ఎడమవైపు బుల్లెట్ దిగబడింది. కుల్నా జిల్లాలో సోమవారం ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని బంగ్లాదేశ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోనాదాంగ అనే ప్రాంతంలోని ఓ నివాసం వద్ద కాల్పులు జరిగాయని వివరించాయి.
కాగా, ఈ ఘటనపై ఎన్‌సీపీకి చెందిన సైఫ్ నవాజ్ అనే వ్యక్తి స్పందించారు. ఎన్‌సీపీ లేబర్ విభాగానికి ముహమ్మద్ కీలక వ్యక్తిగా ఉన్నారని అన్నారు. పార్టీ సెంట్రల్ ఆర్గనైజర్‌గా, కుల్నా డివిజనల్ కన్వీనర్‌గా ఉన్నారని వివరించారు. కుల్నాలో పార్టీకి సంబంధించిన ర్యాలీని నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారని, త్వరలోనే ఈ ర్యాలీని నిర్వహించాల్సి ఉండగా, అంతలోనే కాల్పులు జరిగాయని సైఫ్ నవాజ్ చెప్పారు. తల ఎడమవైపున గాయం అయ్యిందని, ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు.
ఈ ఘటనపై సోనాదాంగ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అమినేష్ మండల్ మీడియాతో మాట్లాడారు. బుల్లెట్ గాయానికి గురైన ముహమ్మద్‌ను వెంటనే కుల్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. అక్కడి నుంచి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తరలించి తలను సీ.టీ. స్కాన్ చేశారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
Read Also- Girl Kills Father: నాన్నకు డ్రగ్స్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక దగ్గరుండి ప్రియుడితో చంపించిన బాలిక
కాగా, ఇటీవలే విద్యాసంఘం నాయకుడు హదీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి మరణవార్త తెలిసిన వెంటనే రాజధాని ఢాకాలో నిరసనకారులు విధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ మీడియా కార్యాలయాలపై కూడా దాడులు చేశారు. భారత అనుకూల వైఖరిని అవలంభిస్తున్నాయనే ఆరోపణలతో ఈ దాడులు చేశారు. హదీ హత్య, ప్రస్తుత అల్లర్ల వెనుక భారతదేశ ప్రమేయం ఉందంటూ అక్కడి అతివాద శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హిందూ మైనారిటీలు, భారతీయ దౌత్య కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
దీంతో, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను అదుపు చేయడంలో ఆయన వైఫల్యం చెందారని మెచ్చుకున్నారు. ఈ తాజా అల్లర్లు 2026 ఫిబ్రవరిలో జరగనున్న జనరల్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు దేశ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

