Girl Kills Father: ప్రేమలో పడ్డ ఓ మైనర్‌కు ఆమెను కన్నతండ్రే అడ్డుగా కనిపించాడు. ఇలాంటి వ్యవహారాలు తప్పు అని చెప్పినందుకు, ప్రియుడితో కలిసి ఊహకందని రీతిలో హత్య (Girl Kills Father) చేయించింది. గుజరాత్‌లోని వడోదరలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల వయసున్న ఓ బాలిక, తన ప్రేమను వ్యతిరేకిస్తున్నాడని తండ్రిపైనే ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి చంపేసింది. ముందుగా తండ్రికి డ్రగ్స్ ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడిని పిలిచింది. అతడు కత్తితో పొడిచి చంపుతుంటే అక్కడే ఉండి కళ్లారా చూసింది. ఈ షాకింగ్ ఘటన గతవారం జరిగింది. ఈ ఘటనలో బాలికతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్‌కు తరలించినట్టు పోలీసులు (Crime News) వెల్లడించారు.
తొలుత మిస్టరీ మరణంగా కేసు నమోదయింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరపగా, కన్నకూతురి చేతిలోనే తండ్రి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి పేరు షానా చావ్డా అని, రంజీత్ గజేంద్రభాయ్ (24) అనే వ్యక్తితో తన కూతురి ప్రేమాయణాన్ని ఆయన వ్యతిరేకించినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రేమికులు ఇద్దరూ ఈ ఏడాది జులైలో ఎక్కడి పారిపోయారని, దాంతో తండ్రి వెళ్లి రంజీత్‌పై కేసు పెట్టాడని తెలిపారు. ఫిర్యాదు మేరకు రంజీత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదయిందని, అయితే, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడని, ఈ క్రమంలోనే ఈ ఘోరమైన హత్యకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
Read Also- James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత
నిందితుడు రంజీత్ బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి హత్య చేయాలని ప్రయత్నిస్తూ వచ్చారని, హత్య జరిగిన రోజు తండ్రికి నిందితురాలు డ్రగ్స్ ఇచ్చిందని, ఆయన బాగా మత్తులోకి జారుకున్న తర్వాత హత్య చేశారని వడోదర పోలీసులు మీడియాకు తెలిపారు.
పలుమార్లు ప్రయత్నం.. విఫలం
నిజానికి కన్నతండ్రిని చంపేందుకు నిందిత మైనర్ బాలిక అంతుకుముందు కూడా పలుమార్లు ప్రయత్నించింది. డిసెంబర్ 16న తల్లిదండ్రులకు డ్రగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, సాధ్యపడలేదు. అయితే, డిసెంబర్ 18న ఎలాంటి అనుమానం రాకుండా తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ ఆహారం తిన్న తండ్రి షానా చావ్డా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత, బాలిక ప్రియుడు రంజిత్, మరో వ్యక్తి భవ్య మహేష్ భాయ్ వాసవ (23) గదిలోకి వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచారు. వారిద్దరూ కలిసి షానా చావ్డాను హత్య చేస్తుండగా కూతురు కిటీకి నుంచి చూసింది. అంతేకాదు, తండ్రి అడ్డుతొలగిపోయిందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఆమె ఎదురుచూసిందని పోలీసులు వివరించారు.
హత్యకు గురైన షానా చావ్డా తన కూతురి ప్రేమను వ్యతిరేకించారని, తండ్రి సమయాల్లో తన భార్య, కూతురు ఒకే గదిలో నిద్రించేలా షరతు విధించారని, బయట నుంచి గదికి తాళం వేసేవారని వడోదర జిల్లా పోలీసు అధికారి సుశీల్ అగర్వాల్ వివరించారు. బయటకు వెళ్లకుండా ఇలా చేశారని అన్నారు. అయితే, తండ్రిని అడ్డుగా భావించిన, బాలిక మూడు నెలలుగా హత్య చేసేందుకు ప్రణాళికలు వేస్తూ వచ్చిందని మీడియాకు వివరించారు. నిందితుడు రంజిత్ ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, హత్య కోసం ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషిస్తున్నామని పోలీసులు వివరించారు.

