Sheikh Hasina: తీవ్రమైన హింస, అల్లర్ల పరిస్థితుల్లో ప్రాణభయంతో తన దేశాన్ని విడిచిపెట్టి, ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు (Sheikh Hasina) మరణశిక్ష పడింది. మానవత్వంపైనే ఆమె నేరాలకు పాల్పడ్డారని, మూడు అభియోగాలలో దోషిగా తేలారంటూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డ హసీనాకు కేవలం ఒకే ఒక్క శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాం. అదే, మరణశిక్ష’’ అని జడ్జీలు ప్రకటించారు.
విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని, వాటి ఫలితంగానే గతేడాది హింసాకాండ చెలరేగిందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ మొహద్ గోలాం మొర్తుజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించింది. ఇవే అభియోగాలలో హసీనాకు కీలక సహాయకులైన మాజీ హోం మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ కమల్, మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ కూడా దోషులేనని చెప్పింది. దేశవ్యాప్తంగా నిరసనకారులను హత్యలు చేయడానికి, అకృత్యాలకు పాల్పడడానికి ఈ ముగ్గురు నిందితులు కారణమని, వీరి ముగ్గురూ కుమ్మక్కయ్యారని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. అయితే, ట్రిబ్యునల్‌ను, బంగ్లాదేశ్ ప్రజలను క్షమాపణ కోరడంతో మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా మామున్‌ను మాత్రం కోర్టు క్షమించింది. నిజానికి చౌదరి అబ్దుల్లా మొదట్లో వ్యక్తిగత విచారణ ఎదుర్కొన్నారు. అయితే, ఆ తర్వాత అప్రూవర్‌గా మారడంతో ఆయన క్షమాభిక్ష లభించింది. ఇక, హసీనా, కమల్ ఇద్దరూ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకుండానే విచారణ పూర్తయింది.
Read Also- Family Politics: మొన్న షర్మిల.. నిన్న కవిత.. నేడు రోహిణి.. పార్టీల్లో ఆడబిడ్డలకే గెంటివేతలు!
విద్యార్థుల ఉద్యమాన్ని తక్కువ చేశారు
అలర్ల సమయంలో అధికారంలో ఉన్న హసీనా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌లను విస్మరించిందని, విద్యార్థుల డిమాండ్లను ఆలపించడానికి బదులుగా, ఆ ఉద్యమాన్ని తక్కువచేసి, అణిచివేయాలని చూశారని పేర్కొంది. అంతేకాదు, విద్యార్థుల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడింది. అవమానకరమైన వ్యాఖ్యల తర్వాత, విద్యార్థులు, మహిళలు మరింత ఆగ్రహాలకు గురయ్యారని పేర్కొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులను అంతం చేయాలంటూ షేక్ హసినా ఆదేశాలు ఇచ్చారని ఢాకా కోర్టు తన తీర్పులో తెలిపింది. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులపై అవామీ లీగ్ పార్టీ విభాగాలు దాడులకు పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ సాక్షులు నిరూపించారని జడ్జిలు చెప్పారు.
నిరసనకారులు గుమిగూడిన ప్రాంతాలను గుర్తించడానికి డ్రోన్‌లు, వారిని హత్యలు చేయడానికి హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించాలని షేక్ హసీనా శాంతి భద్రతల ఏజెన్సీలను ఆదేశించారని కోర్టు పేర్కొంది. నాడు హోం మంత్రిగా ఉన్న అసదుజ్జామాన్ ఖాన్, మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ ప్రాణాంతక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్ల వాడాలంటూ అధికారులను ప్రేరేపించారని తెలిపింది. అకృత్యాలను నియంత్రించడంలో విఫలమయ్యారని, తద్వారా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని, అందుకే శిక్షార్హులని ట్రిబ్యునల్ చెప్పింది. తన ప్రమేయాన్ని ఒప్పుకోవడంతో చౌదరి అబ్దుల్లాకు క్షమాభిక్ష లభిస్తుందని తెలిపింది. షేక్ హసీనా, కమల్‌లను దోషులుగా నిర్ధారిస్తున్నామని, వారు పారిపోవడం వారి చేసిన నేరానికి సంకేతమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
Read Also- CM Revanth Reddy: తెలంగాణకు ఆర్ఎఫ్‌సీ ఫోర్త్ వండర్.. పత్రికా రంగంలోనూ కీలక పాత్ర
తీర్పుపై హసీనా స్పందన ఇదే
తనకు మరణశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై షేక్ హసీనా స్పందించారు. ఈ తీర్పు అహంకారపూరితమని, హంతక ఉద్దేశాన్ని చాటిచెప్పిందని ఖండించారు. ఎన్నికలు లేకుండా ఏర్పాటైన ప్రభుత్వంలోని అతివాద వ్యక్తుల హంతక ఉద్దేశాన్ని స్పష్టం చేసిందన్నారు. తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తన అవామీ లీగ్ పార్టీకి, తనకు కోర్టులో సమర్థించుకునేందుకు సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ట్రిబ్యునల్, అందులోని సభ్యులు పక్షపాతంగా వ్యవహరించారన్నారు. ట్రిబ్యునల్‌లోని జడ్జిలు, న్యాయవాదులు ప్రస్తుత ప్రభుత్వానికి బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేశారని ఆమె మండిపడ్డారు.
