Sunita Williams: 8 రోజుల పర్యటన కోసం వెళ్లి 9 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయారు. భువి నుండి దివి పైకి వెళ్లిన వీరు, దివి నుండి భువికి వచ్చేందుకు 9 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఎదురు చూసింది. కొందరు పూజలు చేసి, వీరు క్షేమంగా భువిపై దిగాలని కోరుకున్నారు. దీనితో ఎట్టకేలకు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు భూమి మీదికి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. వీరు క్షేమంగా అంతరిక్షం నుండి భువిపైకి రావడంతో అందరూ సంబరాలు జరుపుకున్నారు.
జూన్ 5, 2024 లో మరో వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ , జూన్ 14 నే భూమి మీదికి రావాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజి కారణంగా టెక్నికల్ సమస్యలు రాగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. నాసా ఎట్టకేలకు క్రూ-10 మిషన్ ను ప్రయోగించి వారిద్దరినీ భూమి మీదికి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. గతంలో రెండు దఫాలు వీరిని భూమి మీదికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆ ప్రయత్నం ఆగింది. చివరికి నాసా చేసిన మూడవ ప్రయత్నం విజయవంతమైంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణమైన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ యావత్ ప్రపంచం వీరి రాక కోసం ఎదురు చూసింది. అయితే అనుకున్నట్లుగానే సునీత, బుచ్ఐవిల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ తో గల క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సుల్ డోర్‌ను ఓపెన్ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు.
9 నెలలు అంతరిక్షంలో ఉండి ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ క్షేమంగా భూమిపైకి దిగారు. వీరిని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించినట్లు NASA తెలిపింది. అక్కడ వీరికి డాక్టర్ల బృందం వైద్యపరీక్షలు నిర్వహించారు. 9 నెలలు అంతరిక్షంలో ఉండటంతో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు
జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.
Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్.. అంతరిక్ష నిద్ర ఎన్ని గంటలో తెలుసా?
దివి నుండి భువిపైకి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్.. రెండు చేతులు ఊపుతూ అందరినీ పలకరించి ఆశ్చర్య పరిచారు. సాధారణంగా సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉందని కాస్త ప్రచారం సాగింది. కానీ అందుకు భిన్నంగా సునీతా విలియమ్స్ రెండు చేతులు ఊపుతూ.. చిరునవ్వుతో కనిపించడం విశేషం. ఎంతైనా భారత సంతతి బిడ్డ కదా.. ఆ మాత్రం ధైర్యం ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.