YouTuber Arrest: పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. 15-17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లను ఇంటర్వ్యూల పేరుతో అసభ్య ప్రశ్నలు అడుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు తేల్చారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండింగ్ కావడంతో కేసును సుమోటోగా తీసుకొని యూట్యూబర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యూస్ కోసమే మైనర్లతో ఇలాంటి అసభ్యకరమైన ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే పక్కా డిజిటల్ ఆధారాలు సేకరించి.. తాజాగా కంబేటి సత్యమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Khamenei – Trump: ‘ట్రంప్.. నీ పతనం ఖాయం’.. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రధానంగా ఓ ఇంటర్వ్యూలో బాలుడ్ని ముద్దు పెట్టుకునేలా బాలికను సత్యమూర్తి ప్రోత్సహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీని ఆధారంగానే తొలుత కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. ఇదే రీతిలో అతడి ఇంటర్వ్యూల్లో అసభ్యకరమైన ప్రశ్నలు ఉంటున్నట్లు తేల్చారు. బాలల రక్షణ చట్టాలతో పాటు సైబర్ చట్టాన్ని సైతం అతడు ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి అతని టీమ్.. వైజాగ్ వెళ్లి మరి సత్యమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ తీసుకొచ్చి అతడ్ని విచారణ చేస్తున్నారు. డిజిటల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.

