Young Man Dies: హనీమూన్ కోసం భార్యతో సంతోషంగా బయల్దేరిన యువకుడు రైలు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషాదానికి రైల్వే పోలీసులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నివాసి రమేశ్ కూమారుడు సాయి. ఓ గిఫ్ట్ ఆర్టికల్ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం సాయి వివాహం జరిగింది. గోవాలో హనీమూన్ జరుపుకోందామని సాయి దంపతులు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో సాయి తన భార్య, బావమరిది, ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు.
Also Read: Medchal: ఏటా వర్షాకాలంలో.. రాకపోకలకు తప్పని తిప్పలు!
కానిస్టేబుల్ పట్టించుకోలేదు
9వ నెంబర్ ప్లాట్ ఫాంపై వాస్కోడిగామా రైలు ఎక్కాడు. అప్పటికి ట్రైన్ ఆగి ఉంది. బయలుదేరటానికి సమయం పడుతుందని భావించిన సాయి వాటర్ బాటిల్ కొనటానికి కిందకి దిగాడు. ఆ వెంటనే రైలు ముందుకు కదలటంతో అతని స్నేహితులు చైన్ లాగారు. ఆ వెంటనే అక్కడికి వచ్చిన ఓ రైల్వే కానిస్టేబుల్ ఇద్దరిని కిందకి దింపాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. అక్కడికి వచ్చిన సాయి జరిమానా కడతానని చెప్పినా కానిస్టేబుల్ పట్టించుకోలేదు.
ఈ విషాదానికి రైల్వే కానిస్టేబులే కారణం
అదే సమయంలో రైలు మరోసారి ముందుకు కదిలింది. భార్య రైల్లో ఉండటంతో సాయి రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు. కాలు జారటంతో ప్లాట్ ఫాం… రైలు మధ్య ఉన్న గ్యాప్ లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి కొద్దిసేపు తర్వాత ప్రాణం వదిలాడు. ఈ విషాదానికి రైల్వే కానిస్టేబులే కారణమని సాయి బావమరిది ఆరోపించాడు. గొడవ పడకుండా జరిమానా కట్టించుకొని విడిచి పెట్టి ఉంటే సాయి చనిపోక పోయేవాడని చెప్పాడు. ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read: Kodanda Reddy: రైతు బిడ్డ సీఎం.. కోదండ రెడ్డి సంచలన వాఖ్యలు!