MD Ashok Reddy: భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో జలమండలి వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. జలమండలి పరిధిలో 200 గజాల ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు అవసరమని, 300 గజాల పైన ఉన్న ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకత ప్రజలకు తెలపడానికి జలమండలి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిందని ఆయన వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
జీహెచ్ఎంసీ నుండి ఓఆర్ఆర్ వరకు భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంగా ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అధికారులతో కలిసి మాదాపూర్‌లో పర్యటించారు. కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఉన్న 15 ఫ్లాట్ల ఓ అపార్ట్‌మెంట్ వాసులు ఇంజక్షన్ బోర్‌వెల్‌తో నీటి సమస్య లేకుండా చేసిన తీరు ప్రశంసనీయమన్నారు. ఈ చర్య ఉత్తమ నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
Also Read: MD Ashok Reddy: త్వరలో వాటర్ ఆడిట్.. ప్రతి చుక్క నీటిని లెక్కకడతాం: ఎండీ అశోక్ రెడ్డి
కర్తవ్యంగా భావించండి
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ, ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాలను పెంచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో జలమండలి ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిందని తెలిపారు. జలమండలి భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతల కార్యక్రమంలో ప్రతి నివాస సముదాయాలు తమ కర్తవ్యంగా భావించి భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నగరంలో నేలను కాంక్రీట్ కప్పేస్తుండటంతో వర్షపు నీరు భూమిలో ఇంకే పరిస్ధితి కనిపించడం లేదని, భూగర్భజలాలు దిగువకు పడిపోయి పైకి చుక్క నీరు రావడం లేదన్నారు. వర్షపు నీటి సంరక్షణతోనే భూగర్భజలాలు పెంచవచ్చని, వృధాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చెయ్యాలని వివరించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి అని, దీంతో నీటి ఎద్దడి సమస్య తగ్గుతుందని ఎండీ వివరించారు. గ్రేటర్ పరిధిలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలుంటే కృష్ణా ఫేజ్-4 ప్రాజెక్టు అవసరముండకపోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Operation Chhatru: జమ్మూలో ఉగ్రవాదుల ఏరివేత.. కిష్తివాడ్ జిల్లాలో ఆపరేషన్ ఛత్రు ప్రారంభం

