Operation Chhatru: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్తివాడ్ జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి గురించి అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ ఛత్రు’ను ప్రారంభించాయి. కిష్తివాడ్‌లోని మారుమూల ఛత్రు ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో రెండు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాద బృందం గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు..
తెల్లవారుజామున సంయుక్త బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించగానే, ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో, ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది’ అని ఆర్మీ తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పారాట్రూపర్ గాయపడగా, మెరుగైన చికిత్స కోసం అతడిని తక్షణమే ఉధంపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
Also Read: MP Raghunandan Rao: జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం: ఎంపీ రఘునందన్ రావు
ఉగ్రవాదుల కదలికలకు ట్రాక్
కిష్తివాడ్ జిల్లా గత ఏడు నెలల్లో ఆరు ఎన్‌కౌంటర్‌లను చూసింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి భద్రతా బలగాలు తమ వేటను ముమ్మరం చేశాయి. ఛత్రు ప్రాంతం కొండ ప్రాంతాలలో ఉండటం వలన, ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, ఏరియల్ నిఘా వంటి అధునాతన పద్ధతులను భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నాయి.
Also Read: MD Ashok Reddy: త్వరలో వాటర్ ఆడిట్.. ప్రతి చుక్క నీటిని లెక్కకడతాం: ఎండీ అశోక్ రెడ్డి
