Panchayat Elections: లక్షలు ఖర్చు చేస్తేనే గెలవని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, తాను గెలుస్తానో లేదోనన్న అనుమానంతో ఆత్మహత్య(Suside) చేసుకున్న వ్యక్తిని ఓటర్లు గెలిపించడం సంచలనం రేపింది. సంగారెడ్డి(sangareddy) జిల్లా రాయికోడ్ మండలం, పీపడ్ పల్లి(Peepad palli) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్(Congress) పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చాల్కీ రాజు(Raju) (42) గత ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఓటర్లు సానుభూతి వ్యక్తం..
అయితే, రెండవ విడుతగా జరిగిన ఎన్నికల్లో రాజుకు ఓటర్లు సానుభూతిని వ్యక్తం చేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం, మృతుడు చాల్కీ రాజు సమీప ప్రత్యర్థిపై 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారు మృతుడు చాల్కీ రాజుకు 699 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థికి 690 ఓట్లు వచ్చాయి. బతికి ఉన్న వ్యక్తులే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటే, చనిపోయిన వ్యక్తిపై అభిమానంతో గ్రామస్తులు ఓటు వేసి తమ సానుభూతిని ప్రకటించడం విశేషం. అభ్యర్థి చనిపోయినా ఎన్నికలను నిలుపుదల చేసే చట్టం లేకపోవడంతో, అధికారులు ఎన్నికలను యథావిధిగా నిర్వహించారు.
పీపడ్ పల్లి పంచాయతీకి మళ్లీ ఎన్నికలు?
చనిపోయిన వ్యక్తి గెలుపొందడంతో, ఆ స్థానం ఖాళీ అయినట్లు పరిగణించబడుతుంది. దీంతో, పీపడ్ పల్లి సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, ఓటర్లు వ్యక్తం చేసిన ఈ అరుదైన సానుభూతి రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

