Hyderabad Traffic: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీ కారణంతో పాదచారులు రాకపోకలు సాగించేందుకు బేజారవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం వంటి అభివృద్ది చెందుతున్న సిటీల్లో ఇండియన్ రోడ్ కాంగ్రేస్(ఐఆర్సీ) నిబంధనల ప్రకారం మొత్తం రోడ్లున్న కిలోమీటర్ల పొడువులో కనీసం 30 శాతం మేరకైనా ఫుట్ పాత్ లు ఉండాలి. కానీ గ్రేటర్ లో సిగ్నల్ రహిత ప్రయాణమంటూ ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వస్తున్నా, కాలిన నడకన రాకపోకలు సాగించే పాదచారులు అసరాలను అవి ఏ మేరకు తీర్చలేకపోతున్నాయి.
సుమారు 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రేటర్ సిటీలోని మెయిన్ రోడ్లు, కాలనీ రోడ్లు, సబ్ రోడ్లు, లింక్ రోడ్లతో కలిపి రోడ్లు, భవనాలు, నేషనల్ హై వేలతో పాటు జీహెచ్ఎంసీకి చెందిన రోడ్లు దాదాపు 9 వేల కిలోమీటర్ల పొడువున ఉన్నాయి. వీటిలో ఆరు వేల కిలోమీటర్ల పొడువున బీటీ రోడ్లుండగా, మరో మూడు వేల కిలోమీటర్ల పొడువున సీసీ రోడ్లున్నాయి. కానీ ఫుట్ పాత్ లు మాత్రం కేవలం 728 కిలో మీటర్లు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా మెయిన్ రోడ్లు, కాలనీ రోడ్లలో పాదచారులు రాకపోకలు సాగించేందుకు వీల్లేకుండా పోయింది. కారణంగా చిన్న చిన్న ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి.
2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కేవలం 300 కిలోమీటర్ల మాత్రమే ఫుట్ పాత్ లు పాదచారులకు అందుబాటులో ఉండేవి. గత గులాబీ సర్కారు హయాంలోని తొమ్మిదేళ్లలో ఫుట్ పాత్ లు 300 కిలోమీటర్ల నుంచి సుమారు 520 కిలోమీటర్ల వరకు పెరిగాయి. ఇపుడు ఆ సంఖ్య 728 కిలోమీటర్లకు పెరిగింది. ఐఆర్సీ నిబంధనల ప్రకారం మన నగరంలోనున్న సీసీ, బీటీ రోడ్ల పొడువు 9 వేల కిలోమీటర్లు కాగా, వాటిలో కనీసం 30 శాతం అంటే దాదాపు 3 వేల కిలోమీటర్ల పొడువైనా ఫుట్ పాత్ లు ఉండాల్సి ఉండగా, కేవలం 728 కిలోమీటర్లకే పరిమితమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట, మెహిదీపట్నం, బేగంపేట, సికిందరాబాద్, లక్డీకాపూల్, సికిందరాబాద్, దిల్ సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై పాదచారులు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఉన్న చోట దుర్వినియోగం
మహానగరంలో పాదచారుల రాకపోకల కోసం ఏర్పాటు చేసే ఫుట్ పాత్ లు చాలా రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో లేకపోగా, అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అవి పూర్తిగా దుర్వినియోగమవుతున్నట్లు పాదచారులు వాపోతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లను విస్తరిస్తూ, ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తున్నా, అవి పాదచారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
చాలా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లపై షాపులు ఏర్పాటు చేయటం, మరి కొన్ని చోట్ల విద్యుత్ శాఖ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయగా, ఇంకొన్ని చోట్ల కంచె చేను మేసిందన్న చందంగా జీహెచ్ఎంసీనే టాయిలెట్లను నిర్మిస్తుంది. ఈ విషయంలో జీహెచ్ఎంసీకి పలుసార్లు కోర్టు అక్షింతలు వేసినా, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. సిటీ సెంటర్ లో అసెంబ్లీకి కూత వేటు దూరంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ను ఓ హొటల్ చాలాకాలంగా పార్కింగ్ కు వినియోగిస్తుండటంతో పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది.
Also read: Illegal structures: బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు!
ఈ రూట్ లో ప్రతి రోజు సీఎం, మంత్రులు రాకపోకలు సాగిస్తున్నా, హోటల్ కబ్జా నుంచి ఫుట్ పాత్ కు విముక్తి కల్గించే నాధుడే లేడు. సదరు హొటల్ కు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తున్నా, ఫుట్ పాత్ కబ్జా పట్ల చూసీ చూడనట్టుగా వ్యవహారిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, పాతబస్తీలో ఫుట్ పాత్ మాట దేవుడెరుగు కానీ రోడ్డును సగం వరకు ఆక్రమించుకుని రకరకాల వ్యపారాలు కొనసాగుతున్నా, పట్టించుకునే వారే కరువయ్యారన్న విమర్శలున్నాయి.
దూరమవుతున్న యూటర్న్ లు
మహానగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణలో విఫలమైన పోలీసులు నగరంలోని మెయిన్ రోడ్లలో యూటర్న్ లను వాహనదారులకు దూరం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో యూటర్న్ లను బంద్ చేశారు. ఫలితంగా వాహనదారులు కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి యూ టర్న్ లు తీసుకోవాల్సి వస్తుంది. మెట్రో రైలు కారిడార్లున్న దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఫలితంగా వాహానాల ఇంధనంతో పాటు అత్యంత విలువైన సమయం కూడా వృధా అవుతుందన్న వాదన విన్పిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు వెళ్లే దారిలోని హుమాయున్ నగర్ మెయిన్ రోడ్డులో మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద అమ్మవారి టెంపుల్ వద్ద మాత్రమే యూ టర్న్ ఉంది.
సరోజీనీ దేవి కంటి ఆస్పత్రికి వెళ్లాలనుకునే వారు మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ నుంచి యూ టర్న్ తీసుకుని ఎన్ఎండీసీ మీదుగా ప్రయాణించి, పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వే మూడో పిల్లర్ వద్ద యూ టర్న్ తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంది. ఫలితంగా వాహనదారులు బేజారవుతున్నారు. యూటర్న్ లు దూరం కావటంతో అత్యవసర పరిస్థితుల్లో హుమాయూన్ నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్ తదితర ప్రాంతాలకు అంబులెన్స్ సకాలంలో చేరుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ రూట్ లో ఎన్ఎండీసీ వద్ద మాత్రమే పాదచారులు రోడ్డు దాటేందుకు ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది.