Illegal structures: అంగ బలం, అర్థ బలం ఉంటే ఏమైనా చేయవచ్చు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, నిర్మాణాలు చేపట్టవచ్చు. హైడ్రా లాంటి వ్యవస్థను కూడా కప్పేయవచ్చు. ఇందుకు మేడ్చల్ మండల పరిధిలోని డబల్ పూర్ లో జరుగుతున్న నిర్మాణాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు.
డబల్ పూర్ గ్రామ కుడి చెరువు 34 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చెరువు సమీపంలో ఉన్న 66 సర్వే నెంబర్ లో ఒకరికి ఆరు ఎకరాలు పట్టా స్థలం ఉంది. ఆ స్థలంలో నిర్మాణానికి యజమాని 2021లో నీటిపారుదల శాఖ అధికారులను అనుమతులు కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ అధికారులు ఇచ్చిన అనుమతులతో యజమాని ఫామ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాడు. భవన నిర్మాణం నిబంధన ప్రకారమే నిర్మించినప్పటికీ.. ప్రహరీని మాత్రం చెరువు బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన పలువురు గ్రామ కార్య దర్శి తో పాటు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం ప్రహరీ నిర్మాణం బఫర్ జోన్ లో ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. నిర్మాణాన్ని నిలిపి వేయాలని సదరు యజమానికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ తర్వాత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టక చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వెల్లు వెతుతున్నాయి.
Also read: MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యేపై దాడి అంటూ వాట్సాప్ మెసేజ్.. సోషల్ మీడియాలో వైరల్..
బఫర్ జోన్ లో వర్షపు నీరు వెళ్లే కల్వర్టుకు అడ్డుగా ప్రహరీ నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే కుడి చెరువులోకి నీరు రాకుండా పోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంటనే ప్రహరీ నిర్మాణాన్ని నిలిపి వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే అధికారుల ఉదాసీనతపై గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. గ్రామ కార్యదర్శి ప్రహరీ నీ నిర్మిస్తున్న వ్యక్తితో కుమ్మక్కై ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదు పేర్కొన్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆయన కలెక్టర్ ను కోరారు.