TG govt on HCU Land: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములకు సంబంధించి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూమి చుట్టూ ఈ వివాదం చెలరేగగా తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కంచె గచ్చిబౌలి పరిధిలోని 400 ఎకరాల భూమి విషయంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని శక్తులు పూనుకున్నాయని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మారిటీ ప్రభుత్వ భూమేనని, ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అంగుళం స్థలం కూడా లేదని తేల్చి చెప్పింది.
స్వార్థ ప్రయోజనాల కోసమే..
ఉద్దేశపూర్వకంగానే కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు గతేడాది జూన్‌లోనే 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ స్పష్టమైన తీర్పును వెలువరించిందని టీజీఐఐసీ స్పష్టం చేసింది. ఇప్పుడు ఎవరు వక్రభాష్యం చెప్పినా, వివాదం సృష్టించినా అది కోర్టు ధిక్కరణ నేరమే అవుతుందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టీజీఐఐసీ (TGIIC) నొక్కిచెప్పింది. ఆ భూమిలో పీకాక్ లేక్స్, బఫెల్లో లేక్స్ లాంటివి ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
వివాదం ఎందుకంటే
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వేనంబర్ 25కు చెందిన 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి అవసరాలకు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు (మెమో నంబర్ 39612/Assn/V(2) 2003) ప్రకారం కేటాయించింది. అయితే దాన్ని ఆ అవసరాలకు వినియోగించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. ఈ లీజు రద్దుకు సంబంధించి దాదాపు 21 ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరిగిన తర్వాత ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి తిరిగి దక్కిందని టీజీఐఐసీ పేర్కొంది. సెంట్రల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో తాజాగా సర్వే నిర్వహించగా ఒక్క అంగుళం కూడా విశ్వవిద్యాలయం భూమి లేదని స్పష్టమైందని పేర్కొంది. 400 ఎకరాల భూమి యాజమాన్య హక్కులు సంపూర్ణంగా ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది.
Also Read: BRS Silver jubilee: ఆ ఒక్క సభపైనే ఆశలు? పడరాని పాట్లు పడుతున్న బీఆర్ఎస్?
‘విద్యార్థులను తప్పుదోవ పట్టించారు’
ఈ స్థలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరిలోనే టెండర్‌ను పిలిచామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. డెవలప్‌మెంట్ వర్క్స్ లో భాగంగా ఆ ల్యాండ్‌లో ఉన్న రాక్స్ యధావిధిగా ఉంటాయని టీజీఐఐసీ పేర్కొంది. మాస్టర్ ప్లాన్‌లో సుస్థిర అభివృద్ధితో పాటు పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించింది. కొందరు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు వారి స్వప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించింది. 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ 2024 జూన్ 24న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని, పంచనామా అనంతరం జులై 1న టీజీఐఐసీ ఆధీనంలోకి వచ్చాయని వివరించింది.