GHMC – RRR: ప్రస్తుతం మహానగరంలోని కోటి కి పై చిలుకు జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ విస్తరణకు ఎట్టకేలకు సర్కారు ముందడుగు వేసినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన ఏడాద్నినర కాలంలో జీహెచ్ఎంసీ విస్తరణపై రకరకాల ప్రతిపాదనలను పరిశీలించినానంతరం ఎట్టకేలకు సర్కారు జీహెచ్ఎంసీని రీజినల్ రింగు రోడ్డు వరకు విస్తరించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అంతేగాక, ట్రిపుల్ ఆర్ వరకున్న స్థానిక సంస్థల ఆస్తులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి నివేదికలను సమర్పించేందుకు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావు లకు సర్కారు కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు రింగ్ రోడ్ లోపల, బయట తో పాటు ట్రిపుల్ ఆర్ వరకున్న స్థానిక సంస్థల ఆస్తులు, ఆదాయ మార్గాలు, న్యాయపరమైన అంశాల పరిశీలనకు ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, పలుస్థానిక సంస్థల స్పెషల్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమై వివరాలను సేకరించినట్లు తెలిసింది.
Also read: Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..
ఔటర్ లోపల, బయట ట్రిపుల్ వరకున్న స్థానిక సంస్థల విలీనానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను, విలీనం చేయాలనుకుంటే లీగల్ ఎదురయ్యే సమస్యలు వంటివి పరిశీలించిన తర్వాత ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సర్కారుకు నివేదికను సమర్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో డీఎస్ చౌహాన్ ఆయా స్థానిక సంస్థల్లో ఉన్న లీగల్ కేసులు, వాటి పరిష్కారానికి పట్టే కాలాన్ని అంచనా వేయటంతో పాటు వాటి వల్ల విలీనానికి ఏర్పడే అడ్డంకులను అంఛనా వేయనున్నారు.
హేమంత్ సహదేవ్ రావు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావిస్తున్న ట్రిపుల్ ఆర్ వరకున్న స్థానిక సంస్థల రెవెన్యూ మండలాలు, డివిజన్లతో పాటు సర్కారు భూములు, త్రిబుల్ ఆర్ వరకున్న స్థానిక సంస్థల ఆదాయ వ్యవహారాలను అంఛనా వేసి సర్కారుకు నివేదికలను సమర్పించనున్నట్లు తెలిసింది. రానున్న డిసెంబర్ నెలాఖరు కల్లా జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం పూర్తయ్యే అవకాశాముండటంతో అప్పటి వరకు ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని సర్కారు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
జీహెచ్ఎంసీ తదుపరి ఎన్నికలకు కాస్త ఆలస్యం
రానున్న డిసెంబర్ నెలాఖరుతో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియనుంది. కానీ తదుపరి ఎన్నికల నిర్వహణ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జీహెచ్ఎంసీ విస్తరణ, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియతో పాటు కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులను విజుబుల్ స్థాయికి తీసుకు వచ్చిన తర్వాతే అంటే సుమారు ఏడాది కాలం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
Also read: Etela Rajender: బెదిరిస్తే భయపడం.. సీఎంకు ఎంపీ ఈటల సవాల్!
ఇందుకు నిధులలేమీ, రాజకీయపరంగా అధికార పార్టీకి తగినంత బలం లేకపోవటమే ప్రధాన కారణమే అయినా సిటీ సెంటర్ తో పాటు శివార్లలో పలు అభివృద్ది పనులు గాడీన పడే లోపు జీహెచ్ఎంసీ విస్తరణ పూర్తయిన తర్వాత అంటే 2027 చివర్లో గానీ, 2028 ప్రారంభంలో గానీ జీహెచ్ఎంసీ పాలక మండలికి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో సర్కారున్నట్లు తెలిసింది.
త్వరలో ఆస్కీకి ప్రతిపాదనలు
ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మరో సారి పలు దఫాలుగా జీహెచ్ఎంసీ, త్రిబుల్ ఆర్ వరకున్న స్థానికసంస్థల అధికారులతో సమావేశాలు నిర్వహించి విలీనానికి సంబంధించిన నివేదికలను సమర్పించిన తర్వాత సర్కారు వాటిని పరిశీలించి తదుపరి విలీన ప్రక్రియ ఎలా ఉండాలి? పెరగనున్న జీహెచ్ఎంసీ పరిధిని ఎన్ని జోన్లు, ఎన్ని సర్కిళ్లుగా విభజించాలన్న పాలసీ మ్యాటర్ రూపకల్పన కోసం ప్రతిపాదనలను తయారు చేసే బాధ్యతను సర్కారు అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించనున్నట్లు తెలిసింది.
మొత్తం ఏడు వేల కిలోమీటర్ల పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే దిశగా ఆస్కీ ఈ పాలనీని రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన తర్వాత ప్రసాదరావు కమిటీని నియమించి, గ్రేటర్ ను భౌగోళికంగా ఆరు జోన్లుగా, క్రమంగా అవసరానికి తగిన విధంగా 20 నుంచి 30 సర్కిళ్లకు విస్తరించిన తీరు, సిబ్బంది నియామకం మాదిరిగానే జీహెచ్ఎంసీ విస్తరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఓ కమిటీని నియమించి జోన్లు, సర్కిళ్లు, స్టాఫ్ ప్యాట్రన్ ను నిర్ణయించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
ఆదాయం, మౌలిక వసతులే ప్రధానంగా..
జీహెచ్ఎంసీ బయట ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలనున్న స్థానిక సంస్థలను కలిపి జీహెచ్ఎంసీని రెండు ముక్కలుగా చేయాలని సర్కారు ఇదివరకే భావించిన నేపథ్యంలో వీటి విలీనానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఔటర్ బయట నుంచి త్రిబుల్ ఆర్ వరకున్న స్థానిక సంస్థల ఆదాయ వనరులు, మౌలిక వసతులపైనే ఇప్పటికే నియమించిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం.
Also read: YS Sharmila: వైఎస్ షర్మిల నిరవధిక దీక్ష.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుతం ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ వరకున్న అన్నిస్థానిక సంస్థలను కలిపితే జీహెచ్ఎంసీ పరిధి సుమారు ఏడు వేల కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగే అవకాశాలుండటంతో, ఆ మొత్తం విస్తీర్ణాన్ని మూడు ముక్కలుగా, ఒక్కో కార్పొరేషన్ ను 2 వేల నుంచి రెండున్నర వేల కిలోమీటర్ల వరకు వచ్చేలా ఒక్కో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సర్కారున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లకు ఆదాయ వనరులు సమానంగా ఉండేలా, సర్కారు భూములు పంపిణీ, మౌలిక వసతుల కల్పన సమానంగా జరిగేలా ఈ విలీనం జరగాలన్నది సర్కారు ముఖ్య సంకల్పంగా కన్పిస్తుంది.