YS Sharmila: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్యను 34 వేల నుంచి సగానికి తగ్గించేశారని అన్నారు. హిందూ స్థాన్ జింక్ లాగా స్టీల్ ప్లాంట్ ను చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తొలగించిన 2 వేల మంది కార్మికులను వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో 3 వేల మంది ఉద్యోగాలు తీయబోతున్నారని షర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఉక్కు కార్మికుడు చేస్తున్న పోరాటానికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు షర్మిల చెప్పారు. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ కు కష్టం వస్తే రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారని అన్నారు. ప్లాంట్ కు ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలని ఆనాడు వైఎస్ ఎంతో ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. వైఎస్ బతికి ఉంటే.. క్యాపిటివ్ మైన్ వచ్చేదని షర్మిల అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ శనిలా దాపరించి.. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఊపిరి తీస్తోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad Terror Plot: ఏపీలో భారీ పేలుళ్లకు కుట్ర.. సిరాజ్ కేసులో విస్తుపోయే నిజాలు!
దేశంలోని స్టీల్ ప్లాంట్లను అదానీ, అంబానీకు కట్ట పెట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పై బీజేపీ కుట్ర చేస్తోందని.. అందుకే క్యాపిటివ్ మైన్ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను కూటమి నేతలు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.11 వేల కోట్ల ప్యాకేజీ వలన ప్లాంట్ కు ఒరిగేది ఏమి లేదని అన్నారు. 2 వేల మంది ఉద్యోగులను తీస్తే.. చంద్రబాబు, పవన్, బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదని షర్మిల నిలదీశారు. బాబు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉందని.. ఒక్క మేలు అయినా రాష్ట్రానికి వీళ్ళు చేశారా? అంటూ నిలదీశారు. ఎందుకు బిజెపికి మద్దతు ఇస్తున్నారో బాబు, పవన్ కల్యాణ్ చెప్పాలని షర్మిల పట్టుబట్టారు.