Hyderabad Terror Plot: ఉగ్రదాడుల కుట్ర కేసులో అరెస్టయిన విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసు ఫ్యామిలీలో పుట్టిన సిరాజ్.. తను కూడా ఎస్సై కావాలని కలలు కన్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లో కోచింగ్ సైతం తీసుకున్నాడు. అటువంటి సిరాజ్.. ఏ విధంగా ఉగ్రవాదంపై ఆకర్షితుడయ్యాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ లో ఉండగానే సిరాజ్ ఉగ్రవాదంపై ఆకర్షితుడయ్యాడు. వరంగల్ కు చెందిన పర్వాన్, హైదరాబాద్ కు చెందిన సమీర్, యూపీకి చెందిన బాదర్ తో కలిసి ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. జాకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకూబ్, షేక్ జావిద్ ప్రసంగాలతో సిరాజ్ గ్రూప్ బాగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అహిం పేరుతో రాడికల్ సంస్థను సైతం సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది.
ముంబయిలో జరిగిన ఓ మత కార్యక్రమానికి హాజరై మరికొందరితో సిరాజ్ గ్రూప్ పరిచయాలు పెంచుకుంది. ఆ సందర్భంలో బీహార్ కు చెందిన అబుతలేం అలియాస్ మసాబ్ సిరాజ్ కు పరిచయం అయ్యాడు. అతడి సూచనల మేరకు కార్యకలాపాలు చేయడం ప్రారంభించాడు. భారత్ ను ఇస్లాం దేశంగా మార్చాలని సిరాజ్ భావించాడు. మసాబ్ సూచనలతో తక్కువ ఖర్చుతో IED బాంబుల తయారీకి ప్లాన్ వేశాడు.
IED బాంబు తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలను సైతం కొనుగోలు చేసిన సిరాజ్ ముఠా కొనుగోలు చేసింది. తొలుత విజయనగరం రద్దీ ప్రాంతాల్లో బాంబు పేల్చాలని వారు కుట్ర చేసినట్లు కన్ఫెషన్ రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా.. వెంబడించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ హ్యాండిల్ కు తగిలించిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Govt Whip Beerla Ilaiah: నోటిని యాసిడ్‌తో కడుగుతా.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ వార్నింగ్!
విజయనగరంలోని డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు (SB), డిపాజిట్ (FD) ఖాతాలు ఉన్నాయి. వాటిని దర్యాప్తు అధికారులు పరిశీలించగా.. విడతల వారీగా రూ.70,000లు, రూ.80,000ల చొప్పున పలుమార్లు జమ అయినట్లు బయటపడింది. ప్రస్తుతం అతడి ఖాతాల్లో రూ.70 లక్షల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డీసీసీబీలో సిరాజ్ పేరిట ఓ లాకర్ సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సిరాజ్ ఫ్యామిలీ కదలికలపైనా నిఘా వర్గాలు ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.