TIMS Hospitals: టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో విదేశీయులకూ వైద్యం అందించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాల నుంచి ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు? ఇందులో అత్యధిక మంది ఏ సర్జరీలు చేయించుకున్నారు? ఎలాంటి ట్రీట్‌మెంట్ కోసం ఆశ్రయిస్తున్నారు. ఇతర మెట్రో నగరాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌కే ఎందుకు వస్తున్నారు? కార్పొరేట్ దవాఖాన్లు విదేశీ రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటీ? వంటి విషయాలపై స్టడీ చేయాలని ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో హెల్త్ టూరిజంగా మార్చేందుకు ఈ స్టడీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావన. ఇందులో భాగంగానే కార్పొరేట్ మోడల్‌లో తీసుకువస్తున్న టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలోనూ విదేశీ రోగులకు ట్రీట్‌మెంట్ చేయడం వలన ప్రభుత్వ ఆసుపత్రులకు మరింత బ్రాండ్ పెరుగుతుందని సర్కార్ విశ్వాసం. త్వరలోనే ఈ విధానంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నది.
విదేశాల నుంచి భారీగా పేషెంట్లు
ఇప్పటికే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా పేరొందిన నేపథ్యంలో విదేశాల నుంచి పేషెంట్లు భారీగా వస్తున్నారు. ప్రతీ ఏటా సుమారు హైదరాబాద్‌కు రెండు లక్షల మంది పేషెంట్లు వస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం ఒక్కో కీలక కార్పొరేట్ దవాఖాన్లలో ప్రతీఏటా సగటున రెండు వేల మందికిపైనే విదేశీ పేషెంట్లు సర్జరీలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఆయా సర్జరీలు టిమ్స్‌లోనే నిర్వహించేలా ప్లాన్ చేయాలని సర్కార్ ముందుకు సాగుతున్నట్లు తెలిసింది.
వాస్తవానికి అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే ఇక్కడ చికిత్స ఖర్చులు దాదాపు 70 శాతం నుంచి 80 శాతం తక్కువగా ఉన్నాయి. దీంతోనే విదేశీ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఉగాండా, నైజీరియా, టాంజానియా, మెజాంబిక్, కెన్యా, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి హైదరాబాద్‌కు చికిత్స కోసం వస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గుండె, న్యూరో, కాలేయ, మూత్రపిండాలు మార్పిడికి అధికంగా వస్తున్నారు. దీంతో పాటు ఆర్థోపెడిక్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్, వంటి వాటికి ఆశ్రయించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: TIMS Specialty Hospitals: టిమ్స్ హాస్పిటల్స్‌లో ఇక ఆ సేవలు బంద్.. సర్కార్ నిర్నయం
పెయిడ్ సర్వీసుల్లో ఛాన్స్? లోన్లు క్లియర్‌కు అవకాశం?
హైదరాబాద్ సనత్‌నగర్‌ను కార్డియాలజీకి ఎక్స్ క్లూజీవ్ హాస్పిటల్‌గా వంద శాతం పెయిడ్ సర్వీసులు అమలు చేయనుండగా, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌లలో 35–65 శాతం రేషియోలో పెయిడ్ సర్వీస్‌లను అందించనున్నారు. ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు ఉండగా, సనత్‌నగర్ మినహాయిస్తే, మిగతా రెండింటిలో ఈ విధానం కొనసాగనున్నది. అల్వాల్ టిమ్స్‌లోని వెయ్యి పడకల్లో 350 కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీకి అటాచ్ చేయనుండగా, మిగతా 650 బెడ్లలో పెయిడ్ సర్వీస్‌లు అందించనున్నారు. అదే విధంగా ఎల్బీనగర్ కొత్తపేట్ టిమ్స్‌లో 350 మహేశ్వరం మెడికల్ కాలేజీకి అటాచ్ చేస్తుండగా, మిగతా 650 బెడ్లలో పేమెంట్ విధానంలో ట్రీట్‌మెంట్ అందించనున్నారు.
లగ్జరీ రూమ్స్‌తో వైద్య సేవలు
ఈ దవాఖానల్లోకి ప్రవేశించగానే ఎడమ వైపు పెయిడ్ సర్వీస్‌లు ఉండగా, కుడి వైపనకు మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో సేవలు అందిస్తారు. ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా స్టాఫ్ పనిచేయనున్నారు. కార్పొరేట్ స్థాయిలో పెయిడ్ సర్వీస్‌లు అందించనున్నారు. పై అంతస్థుల్లో లగ్జరీ రూమ్స్‌తో వైద్య సేవలు అందించేందుకు ప్రిపరేషన్ జరుగుతున్నది. ఇక సనత్‌నగర్‌లో ఆసుపత్రి పూర్తిగా నిమ్స్ తరహాలోనే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించనున్నది. ఈ దవాఖాన్లలో విదేశీయులకు ట్రీట్‌మెంట్ అందించడం వలన లోన్లు కట్టేందుకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
వాస్తవానికి గత ప్రభుత్వ టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్ల పేరిట దాదాపు 10 వేల కోట్లకు ప్రపోజల్ పెట్టింది. అయితే, నిర్మాణాలను పరిశీలిస్తూ ఫేజ్‌ల వారీగా సుమారు రూ.4800 కోట్లను లోన్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఎస్బీఐ కన్సర్టిమమ్ ద్వారా బ్యాంకు లోన్ ప్రాసెస్ జరిగింది. అయితే లోన్ల షురిటీ కోసం నిమ్స్ స్థలంతో పాటు వరంగల్, సనత్ నగర్, కొత్తపేట్, అల్వాల్ ల్యాండ్లను అప్పగిస్తూ అగ్రిమెంట్లు చేశారు. పేషెంట్ కేర్ నుంచి డబ్బులు తీసుకొని లోన్లు క్లియర్ చేస్తామని గత సర్కార్ ఒప్పందాలు చేసుకున్నది. దీంతోనే ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేయాల్సి వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
Also Read: TIMS Multi Specialty Hospitals: నగరంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు

