Adluri Laxman Kumar: దేశంలోని తొలి జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్ షిప్- 2025లో తెలంగాణకు విజేతగా రికార్డు సృష్టించి అరుదైన గౌరవం దక్కించుకుందని, దీన్ని స్పూర్తిగా తీసుకుని గిరిజన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, (Adluri Laxman Kumar_ వాకిటి శ్రీహరి అన్నారు. దేశంలో తొలిసారిగా నిర్వహించిన జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్ షిప్- 2025లో తెలంగాణ రాష్ట్రం 30 బంగారు, 40 వెండి, 18 కాంస్య పతకాలు సాధించి విజేతగా, అస్సాం రాష్ట్రం రన్నరప్‌గా నిలిచిందని వివరించారు. అక్టోబర్ 28 నుండి 30 వరకు హైదరాబాద్‌లోని హుస్సేన్ లో జరిగిన మూడు రోజుల పోటీలు గిరిజన క్రీడా రంగంలో కొత్త మైలు రాయిగా నిలిచాయని మంత్రులు వ్యాఖ్యానించారు.
దేశంలోని 10 రాష్ట్రాల క్రీడాకారులు
ఈ ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై విజేతలను అభినందించారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ, గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించగా, దేశంలోని 10 రాష్ట్రాల క్రీడాకారులు 200 మీటర్లు, 500 మీటర్ల దూరంలో పురుషులు, మహిళలు, 16 ఏళ్లలోపు, పైబడిన వయసు విభాగాల్లో కానోయ్ కయాక్ విభాగాలలో పోటీ పడ్డారు.
కొత్త క్రీడా విధానం రూపకల్పన
ఈ సందర్భంగా మంత్రి వాకి టి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో తొలి జాతీయ గిరిజన కానోయ్ స్ప్రింట్ ఛాంపియన్‌షిప్ కి ఆతిథ్యమివ్వటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఇది సమగ్ర క్రీడాభివృద్ధికి రాష్ట్రం కట్టుబడి ఉండదనేందుకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్రీడా విధానం రూపకల్పన చేస్తుందని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతను గుర్తించి, ప్రోత్సహించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. భారతదేశం గత ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించగా, తెలంగాణ కంటే చిన్న దేశమైన దక్షిణ కొరియా 32 పతకాలు సాధించినట్లు, 2036 నాటికి భారత్ ప్రపంచ క్రీడా శక్తిగా నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సమగ్ర క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన యువతను క్రీడల ద్వారా శక్తివంతం చేయడంలో గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు. విజేతలు, పాల్గొన్న క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులను, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా. వి. సముజ్వాలా, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ కు చెందిన సర్వేష్ రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, కోచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Adluri Laxman Kumar: విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				