Air Bunched Cables: మహా నగరంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్ల(Air bunched cables)ను ఏర్పాటుచేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(South Telangana Electricity Distribution Company) నిర్ణయించింది. బస్తీల్లో, చిన్న చిన్న గల్లీల్లో, ఇండ్ల ఎదుట ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని బస్తీల్లో, చిన్న చిన్న గల్లీల్లో ఇంటికి అత్యంత సమీపంగా, తగిలేలా ప్రమాదకరంగా ఉన్న ఎల్టీ విద్యుత్ తీగల(ఓవర్ హెడ్ కండక్టర్) స్థానంలో ప్రత్యేక ఇన్సులేషన్ ఉన్న ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఫిక్స్ చేయనుంది.
మెట్రో జోన్ పరిధిలో దాదాపు 550 కిలోమీటర్ల ఎల్టీ ఓవర్ హెడ్ కండక్టర్లను మార్చనుంది. కాగా ఈ పనులు పూర్తిచేసేందుకు ఈనెల చివర వరకు సంస్థ గడువు విధించింది. అందుకు అధికారులను సమన్వయం చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇప్పటికే మహానగరంలో 33 కేవీ, 11 కేవీ నెట్ వర్క్ ను చాలా పటిష్టం చేసినట్లు సంస్థ అధికారులు చెబుతున్నారు. బంచ్డ్ కేబుళ్ల ఏర్పాటుతో బస్తీల్లో, చిన్న చిన్న గల్లీలో చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు.
పోల్ టు పోల్ తనిఖీలు
నగరంలో ఎల్టీ విద్యుత్ తీగల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. కాగా వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపైనా తనిఖీలను పూర్తిచేసినట్లు తెలిసింది. మెట్రో జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో అంటే.. బంజారాహిల్స్(Banjarahills), సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ పరిధిలో నిర్వహించిన పోల్ టు పోల్ తనిఖీలను సంస్థ ఇప్పటికే నిర్వహించింది. ఈ ప్రక్రియను గత వారమే పూర్తిచేసినట్లు చెప్పింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 550 కిలో మీటర్ల మేర ఎల్టీ ఓవర్ హెడ్ కండక్టర్ మార్చాల్సిందని నివేదికలో గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా దీనిని మార్చడానికి కార్యాచరణ రూపొందించామని, గుర్తించిన ప్రదేశాల్లో ఈనెలాఖరు వరకు ఓవర్ హెడ్ కండక్టర్ స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను అమర్చనున్నట్లు తెలిసింది.
Also Read: Rahul Gandhi: దివంగత నేత అరుణ్ జైట్లీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ఇతర సర్కిళ్లలోనూ ఏర్పాటు: ముషారఫ్ ఫరూఖీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర సర్కిళ్లలో కూడా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటుచేస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టంచేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో మెట్రో జోన్ పరిధిలోని సుమారు 160 మంది సబ్-ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అసిస్టెంట్ ఇంజినీర్లతో ఆరా తీశారు.
అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో అసిస్టెంట్ ఇంజినీర్లు సంస్థకు టీం లీడర్ వంటి వారని వివరించారు. సమస్యల పరిష్కారం, సంస్థ పురోభివృద్ధిలో ఏఈలదే కీలక పాత్ర అని స్పష్టంచేశారు. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులపై వారి సూచనలే నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో కీలక భూమిక వహిస్తాయన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్లు సమయ పాలన పాటిస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సంస్థకు మంచి తీసుకురావాలని తెలిపారు. సెక్షన్ అధికారులు(ఏఈ) తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
Also Read: Kavitha vs Jagadish: కవిత వ్యాఖ్యలతో ఎర్రవెల్లికి వెళ్లిన మాజీ మంత్రి