Cyber Crimes: ఎక్కడో ఉండి ఆన్‌లైన్ ద్వారా ప్రజలను మోసం చేస్తూ లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల (Cyber Crimes) ఆట కట్టించడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విస్తృత స్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐదు రాష్ట్రాల్లో నెలరోజులపాటు సైబర్ భద్రతా విభాగం అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 81 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండటం గమనార్హం. పెట్టుబడులు, స్టాక్ ఎక్స్ఛేంజ్, డిజిటల్ అరెస్ట్ వంటి సుమారు 30 రకాలకు పైగా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు.
Also Read: Cyber Criminals Arrested: పక్కా సెటప్‌తో సైబర్ మోసాలు.. 230 సిమ్ కార్డులు సీజ్!
శిఖా గోయల్ పటిష్టమైన చర్యలు
తేలికగా లక్షలు సంపాదించవచ్చనే ఆశతో, భయంతో వీరి ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో రిటైర్డ్ డాక్టర్ గుండెపోటుకు గురై మరణించిన విషయాన్ని కూడా అధికారులు గుర్తు చేశారు. సైబర్ మోసగాళ్ల ఆట కట్టించడానికి సైబర్ భద్రతా విభాగం సంచాలకులు శిఖా గోయల్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అదనపు ఎస్పీ భిక్షంరెడ్డి, డీఎస్పీలు సూర్యప్రకాశ్, హరికృష్ణల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలరోజులపాటు ఆపరేషన్ నిర్వహించాయి. కేరళ నుంచి 7గురు మహిళలతో సహా మొత్తం 28 మంది, మహారాష్ట్ర నుంచి 23 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది, కర్ణాటక నుంచి 13 మంది, తమిళనాడు నుంచి 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ ఉద్యోగులు కూడా
అరెస్ట్ అయిన వారిలో 17 మంది ఏజెంట్లుగా, 11 మంది చెక్కులు, నగదు తీసుకున్నవారు ఉన్నారు. ఇక, 5 శాతం కమీషన్‌కు ఆశపడి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన మరో 53 మంది ఉన్నారు. వీరి నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్‌బుక్కులు, చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో వేర్వేరు బ్యాంకుల ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఒక ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగికి 106 కేసులతో, ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగికి, ఒక బందన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌కు ఈ నేరాలతో సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపడింది. పట్టుబడ్డ కొందరు నిందితులకు విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని సంచాలకులు శిఖా గోయల్ తెలిపారు. విదేశాల్లో ఉంటూ నేరాలు చేస్తున్న వారిపై లుక్ ఔట్ సర్క్యులర్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నేరాల్లో ఇప్పటివరకు రూ.95 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అంచనా వేశారు.
తస్మాత్ జాగ్రత్త
ఆర్థిక సలహాదారులమని చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వారి మాటలు నమ్మవద్దని, పెట్టుబడులు పెట్టవద్దని శిఖా గోయల్ ప్రజలను సూచించారు. డిజిటల్ అరెస్టులు ఉండవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏ దర్యాప్తు సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదన్నారు. ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, క్యూ ఆర్ కోడ్‌లను ఎవ్వరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అధికారిక, ధృవీకరించిన వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించాలన్నారు. మోసాలకు గురైతే 1930 నెంబర్‌కు లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.
Also Read: Ramchander Rao: బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం స్టే ఇవ్వలేదు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
