Swetcha Effect: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సహాయక చర్యల విషయంలో జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాగా పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. హైడ్రాకు జీహెచ్ఎంసీ ఏమాత్రం సహకరించట్లేదని, సహాయక చర్యలతో మాకేం పని అన్నట్లుగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ తీరుపై ఈనెల 20న స్వేచ్ఛ పత్రికలో (GHMC) ‘జీహెచ్ఎంసీకి ఏమైంది? హైడ్రాకు సహకరించట్లేదా?’ అనే శీర్షికతో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ శీర్షికకు హైడ్రా, జీహెచ్ఎంసీ (GHMC) విభాగాల కమిషనర్లు స్పందించారు.
వర్షాకాలం సహాయక చర్యలను పక్కాగా చేపట్టేందుకు ఉభయ శాఖల మధ్య ఎక్కడ, ఎలాంటి గ్యాప్ ఉందో? గుర్తించి, సమన్వయాన్ని పటిష్టపరిచేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణణ్‌లు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వారిద్దరు కలిసి బుధవారం చిన్నపాటి వర్షానికే సమస్యలు తలెత్తే ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లోని వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి, పరిష్కార మార్గాన్ని అన్వేషించారు.
అంతేగాకుండా, జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, (GHMC) హైడ్రా (Hydra) ట్రాఫిక్, ఫైర్ శాఖల అధికారులు, ఉభయ శాఖల కమిషనర్లు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు, ఇంజనీర్లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి, వర్షాకాలం సహాయక చర్యలపై క్లారిటీ ఇచ్చారు. సహాయక చర్యల బాధ్యతలను మున్సిపల్ శాఖ హైడ్రాకు అప్పగించినప్పటికీ, వర్షంతో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థగా జీహెచ్ఎంసీ (GHMC) బాధ్యతను గుర్తు చేశారు. హైడ్రా చేపట్టే సహాయక చర్యల్లో తప్పకుండా జీహెచ్ఎంసీ (GHMC) ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది భాగస్వాములు అవుతారని క్లారిటీ ఇచ్చారు.
ఏం చేద్దాం..?
నాలాల వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వీలైనంత త్వరగా నీటిని తోడేయటం, వాతావరణం పొడిగా ఉన్నపుడు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చటం వంటి ఇతరత్రా పనుల్లో జీహెచ్ఎంసీ భాగస్వామ్యం, హైడ్రాకు సహకారం తప్పకుండా ఉంటుందని కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణకు హైడ్రా ప్రధాన బాధ్యతని, క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, హైడ్రా టీమ్‌తో కలిసి పని చేయాలని కమిషనర్ స్పాట్‌లోనే ఆదేశాలు జారీ చేశారు.
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు హైడ్రాకు జీహెచ్ఎంసీ (GHMC) ఇంజనీరింగ్ విభాగం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్( Hyderabad) పరిధిలో ఓపెన్ నాలా డీ-సిల్టింగ్, నిర్వహణ, కొత్తగా నిర్మించిన సంపుల నిర్వహణ జీహెచ్ఎంసీ (GHMC) చూసుకుంటుందని, లేక్‌లలో నీటి నిల్వ స్థాయి సమాచారాన్ని హైడ్రాతో షేర్ చేసుకుంటూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత కూడా జీహెచ్ఎంసీ నిర్వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సాంకేతికంగా, లాజిస్టిక్, రిసోర్స్ పరంగా హైడ్రాకు వార్డు, సర్కిల్, జోనల్ వారిగా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
మేం ఇవన్నీ చేస్తాం!
భాగ్యనగరంలోని 11 అండర్ పాస్‌ల నిర్వహణ బాధ్యత హైడ్రా (Hydra) తీసుకుంటుందని, ఫ్లై ఓవర్లపై వర్షపు నీరు నిలవకుండా చూసేందుకు వర్షపు నీరు వెళ్లే మార్గాలను క్లీనింగ్ బాధ్యత తాము నిర్వర్తించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా జీహెచ్ఎంసీ అధికారులకు క్లారిటీ ఇచ్చారు. క్యాచ్ పిట్‌లలో డీ సిల్టింగ్ బాధ్యతలను, నాలా సేఫ్టీ ఆడిట్ బాధ్యతలు తాము చూసుకుంటామని, ఇప్పటికే పలు నాలాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి, వరద నీటి ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకులను తొలగించామని వివరించారు. క్యాచ్ పిట్‌లలో డీ సిల్టింగ్ చేయగా వచ్చే మట్టిని తరలించేందుకు వీలుగా వార్డు వారిగా పాయింట్లను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చి, సహకరించాలని రంగనాథ్ కోరారు. మట్టిని అక్కడే వదిలేస్తే, మళ్లీ వర్షం కురిసినపుడు ఆ మట్టి నాలాల్లోకి చేరే అవకాశముందని స్పష్టం చేయగా, ఇందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సానుకూలంగా స్పందించారు.
Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో వీరు అనర్హులు.. పోటీకీ దూరం