Student Suicide: పోలీస్ స్టేషన్లను ప్రథమ న్యాయ స్థానాలని చెబుతారు. బాధితులకు న్యాయం దొరుకుతుందని భావిస్తారు. అయితే, చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దంపతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపాల్సింది పోయి కేసు వాపసు తీసుకొమ్మని సీఐ, ఎస్సైలు బెదిరిస్తున్నారు. దాంతో బాధితులు బుధవారం మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా పాతర్లపాడు మండలానికి చెందిన బీమగాని మణెమ్మ, కృష్ణయ్యలు భార్యాభర్తలు. వీరి కూతురు గంగోత్రి. ఉన్నత విద్య అభ్యసించటానికి హైదరాబాద్ వచ్చిన గంగోత్రి చైతన్యపురి బాబు కాంప్లెక్స్ ప్రాంతంలో నివాసముంటున్న అక్క ఇంట్లో ఉంటోంది. కాగా, మార్చి 8న గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు చేసి వేధించటం వల్లనే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలిసినా ఆ కాల్స్ చేసింది ఎవరన్నది తెలియరాలేదు.
కాగా, ఇటీవల ఈ వేధింపులకు పాల్పడిన వారి గురించి సమాచారం వచ్చినట్టు మణెమ్మ, కృష్ణయ్యలు చెప్పారు. ఆరునెలల క్రితం గంగోత్రి స్వస్థలానికి రాగా అదే ప్రాంతానికి చెందిన కేశబోయిన మహేశ్, జటంగి మహేశ్ లు తమ కూతురికి ఓ ఫోన్ ఇచ్చి ప్రతీరోజూ మాట్లాడాలని చెప్పినట్టుగా తెలియవచ్చిందన్నారు. అలా చేయకపోతే నీ తమ్మున్ని చంపేస్తామని బెదిరించినట్టుగా తెలిసిందన్నారు.
Also read: Crime News: వృద్ధ దంపతుల హత్యలో నిందితుడి అరెస్ట్.. భలే పట్టేశారే!
ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇదే విషయమై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, తమ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకుండా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్యలు తమనే దుర్భాషలాడారని చెప్పారు. కేసులు వాపసు తీసుకోవాలని బెదిరించినట్టు తెలిపారు. ఏప్రిల్ 28న ఎస్సై భద్రయ్య తమ స్వగ్రామానికి రాత్రి 2గంటల సమయంలో వచ్చి తనను దౌర్జన్యంగా జీపులోకి ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్టు కృష్ణయ్య తెలిపాడు.
అక్కడ తనను నిర్భంధించి కేసును వాపసు తీసుకోవాలని వేధించినట్టు చెప్పాడు. తమ కూతురి మొబైల్ కాల్ లిస్టును కూడా ఇప్పటికీ తెప్పించలేదన్నాడు. జటంగా మహేశ్ కు అండగా మాట్లాడుతూ రెండు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయం చేయాలంటూ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు.
తమ బిడ్డ చావుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపాడు. కేసును వాపసు తీసుకోవాలంటూ బెదిరించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్యలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.