AV Ranganath:శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్‌లు వరద నీటిలో మునుగుతున్నాయని తాము పాఠశాలకు వర్షాకాలం వెళ్లలేకపోతున్నామని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్‌కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని శుక్రవారం ఆ ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి పూడికతీత పనులను ఆపొద్దని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇక్కడ అండర్ పాస్‌లన్నిటి పరిస్థితి ఇలాగే ఉంటుందన, వర్షం పడితే ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక్కడ వరద కాలువల్లో పూడికను తొలగించి, సరైన విధంగా నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చునని, వెంటనే ఈ పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు.
Also Read: AV Ranganath: మోడల్‌గా మాసబ్ చెరువు కింది నాలా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
పనులను ముమ్మరం చేయాలి
ఈ సందర్భంగా కమిషనర్ రంగనాధ్ మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టాయని, నాలాల్లో వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితులను వినియోగించుకుని నాలాల్లో పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని హైడ్రా డీఆర్ ఎఫ్, మెట్ టీమ్‌లకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. నగరవ్యాప్తంగా నాలాల్లో పూడిక తీసే పనులను ముమ్మరం చేయాలని సూచించారు. చాలా వరకు పూడికను తొలగించడంతో ఈ ఏడాది భారీ వర్షాలు పడినా ఎక్కడా వరద ముప్పు ఏర్పడలేదని, వచ్చే ఏడాది అస్సలు ఈ సమస్య తలెత్తే అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని రంగనాధ్ అభిప్రాయపడ్డారు.
చెరువులను పరిశీలిస్తూ వస్తున్న హైడ్రా కమిషనర్
ప్రజావాణి ఫిర్యాదుల మేరకు నగరంలోని నాలాలను, చెరువులను పరిశీలిస్తూ వస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాలలో నాలాల్లో పూడిక తీత పనులను పర్యవేక్షించారు. నాలాల్లో పూడిక తీత పనులకు, వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు ఇదే సరైన సమయంగా భావిచాలని హితవుపలికారు. అలాగే ప్రాంతాల వారీ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలన్నారు. అలాగే హరిహరపురంలోని కాప్రాయి చెరువుతో పాటు శంషాబాద్, పెద్దగోల్కొడలోని నరసింహ చెరువు, బాలాపూర్ మండలంలోని కోమటి కుంటను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. వర్షాకాలం ఏ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిందనేది ఇప్పటికే తెలిసినందున వచ్చే ఏడాది అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
చెరువులతో వరదలకు చెక్
నగరంలో చెరువులను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువులను తగిన మొత్తంలో ఖాళీ చేయించి, వరద నీరు నిలిచేలా చూడాలన్నారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హరిహరపురం కాలనీలో ఉన్న కాప్రాయి చెరువుకు ఔట్‌లెట్‌లు లేక ఎగువున ఉన్న తమ కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇన్‌లెట్ ద్వారా ఎంత మొత్తంలో వరద వస్తుందో? అంతే మొత్తం కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు. ఔట్‌లెట్‌లు లేకపోవడంతో చెరువు నిండి తమ నివాసలు నీట మునుగుతున్నాయని హరిహరపురం కాలనీ నివాసితులు వాపోయారు. వరద నీరు చెరువులోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడం వల్ల స్నేహమయినగర్, అఖిలాండేశ్వరి, గ్రీన్‌ల్యాండ్స్ తో పాటు ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతున్నాయన్నారు. ముఖ్యంగా కాప్రాయి చెరువు కింద ఉన్న కాలనీల్లోని నాలాల్లో పూడికను తొలగిస్తే మురుగు రహదారులను ముంచెత్తకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు. పూడిక తీత నిరంతర ప్రక్రియగా సాగాలని సూచించారు. వెంటనే ఈ పనులు చేపట్టాలని హైడ్రా డీఆర్ ఎఫ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
అలుగుపైన రహదారితో
శంషాబాద్‌లోని నరసింహ చెరువు అలుగు ఎత్తును పెంచి రహదారిగా మార్చడంతో చెరువు విస్తీర్ణం పెరిగి పైన ఉన్న పంటపొలాలు, లేఔట్‌లు, నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయనే ఫిర్యాదును కూడా హైడ్రా కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ 15 వద్ద చెరువు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. త్వరలోనే ఇరిగేషన్ అధికారులతో పాటు చెరువు వాస్తవ విస్తీర్ణం ఎంతో నిర్ధారించి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో బండ్ వేయడంతో బాలాపూర్ మండలంలోని కోమటికుంట విస్తీర్ణం తగ్గిపోయిందనే ఫిర్యాదును కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణతో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపనన్నట్లు వచ్చే వర్షాకాలానికి ఈ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్థానికులకు హైడ్రా కమిషనర్ వివరించారు. కమిషనర్ పర్యటనలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్యగారు, హైడ్రా ఏసీపీలు తిరుమల్, ఉమామహేశ్వర రావుతో పాటు పలువురు అధికారులున్నారు.
Also Read: IT Park: కండ్లకోయ ఐటీ పార్కుకు శంకుస్థాపన.. ముందుకు సాగని పనులు
