Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ రోజురోజుకి అస్తవ్యస్తంగా మారుతుంది. ముఖ్యంగా 2017 నుంచి స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సంస్థ తరుచూ మెయింటనెన్స్ లో విఫలమవుతుండటాన్ని ఇప్పటికే చాలా సార్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించినా, గత నెలాఖరుతో ఈఈఎస్ఎల్ కాంట్రాక్టు గడువు ముగిసినా, మరో రెండు నెలల పాటు స్ట్రీట్ లైట్స్ మెయింటనెన్స్ బాధ్యతను అధికారులు మళ్లీ ఈఈఎస్ఎల్ కే కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. వీధి ధీపాలకు సంబంధించి లైట్లు సరిగ్గా వెలగటం లేదని, డిమ్ముగా వెలుగుతున్నాయని, అసలు వెలగటం లేదంటూ జీహెచ్ఎంసీకి ప్రతి నెల 20 వేల ఫిర్యాదులు అందాయంటే ఈఈఎస్ఎల్ నిర్వహణ ఎంత గొప్పదో అంచనా వేసుకోవచ్చు.
స్ట్రీట్ లైట్ల మరమ్మత్తులకు సంబంధించిన సామాగ్రిని కనీసం అయిదు శాతం బఫర్ కోటా మెుయింటెన్ చేయకపోవటంతో జీహెచ్ఎంసీ చాలా సార్లు జరిమానాలు కూడా విధించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ చేపట్టేందుకు వీలుగా మ్యాన్ పవర్ లేకపోవటంతో రెండు నెలల పాటు ఈఈఎస్ఎల్ కు ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇందుకు అనుకూలంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం.
మున్ముందు జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్ మెయింటనెన్స్ బాధ్యతలు ఎవరికి అప్పగించినా, మెయింటనెన్స్ తీరును ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు థర్డ్ పార్టీని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ థర్డ్ పార్టీని నియమించుకున్న తర్వాత సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) బాక్స్‌లను ఏర్పాటు చేసుకుని, థర్డ్ పార్టీ వీటి నిర్వహణ తీరును ఎప్పటికపుడు ఆకస్మికంగా తనిఖీలు చేసేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా వెలగని వీధి ధీపాలను గుర్తించి ఒక్కో దానికి రోజుకి రూ. 500 జరిమానాలు వేయాలన్న యోచనలో జీహెచ్ఎంసీ ఉన్నట్లు సమాచారం.
Also Read: KCR: పార్టీల్లో భిన్నాభిప్రాయాలపై సైలెంట్ గా ఉండండి.. కేసీఆర్!
రెండు నెలలు కష్టకాలమే
ఈ సారి వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ఇప్పటికే జీహెచ్ఎంసీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసుకుంది. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముండటంతో అదే రోజు నుంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే కూడా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రకారం మరో వారం రోజుల తర్వాత వర్షాలు దంచి కొట్టే అవకాశముంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా చోట్ల వీదిధీపాలు వెలగక వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో మరో రెండు నెల పాటు ఈఈఎస్ఎల్ ఈ అస్తవ్యస్తమైన మెయింటనెన్స్ ను కొనసాగిస్తే వాహనదారులకు వర్షం కురిసినపుడు కష్టాలు తప్పేలా లేవన్న విమర్శలున్నాయి. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు మెరుగైన, పారదర్శకమైన సరి కొత్త టెక్నాలజీతో కూడిన విధానాన్ని తీసుకురావాలని జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తున్నా, అందుకు మరో రెండు నెలల కంటే ఎక్కువే సమయం పట్టే అవకాశాలుండటంతో సగం వర్షాకాలం నగరంలోని పలు మెయిన్ రోడ్లు, కాలనీ రోడ్లలో అంధకారం తప్పేలా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: GHMC: స్వచ్చ ఆటో టిప్పర్లు ఓవర్ యాక్షన్.. నిబంధనలకు విరుద్దంగా గ్యార్బేజీ సేకరణ!