South Central Railway: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పిలుపు నిచ్చారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వివిధ బృందాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల, సరుకు రవాణా విభాగం రెండింటిలోనూ రికార్డు స్థాయి సాధించి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. ఈ జోన్ 2025 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రూ. 15,579 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 4 శాతం పెరిగిందన్నారు.
దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారిగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 257 రోజుల అతి తక్కువ వ్యవధిలోనే సరుకు రవాణా 100 మిలియన్ టన్నుల మార్కును అధిగమించడం ఈ జోన్‌కు గర్వకారణమన్నారు. భద్రతను పెంచే దిశలో భాగంగా ట్రాక్‌ల నిర్వహణకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు జోన్ 643 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేసిందని తెలిపారు. ట్రాక్ జోడింపు పరంగా , దక్షిణ మధ్య రైల్వే 30 కిలోమీటర్ల డబ్లింగ్, 115 కిలోమీటర్ల ట్రిప్లింగ్, 2 కిలోమీటర్ల బైపాస్ లైన్‌ను పూర్తి చేసిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు.
Also Read: Gurukul Student Death: గురుకుల బాలిక ఘటన.. పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్.. వెలుగులోకి కీలక విషయాలు!
అధిక రద్దీ ఉన్న మార్గాలలో సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి, మొత్తం 435 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభింనట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఇది మునుపెన్నడూ ఏ రైల్వే జోన్ కూడా సాధించని ప్రగతి ఇదని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే వర్క్‌షాప్‌లు.. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 2,340 కోచ్‌ల లక్ష్యాన్ని అధిగమించి 2,352 కోచ్‌ల పి.ఓ.ఎచ్ అవుట్‌వర్న్ నమోదు చేశాయని తెలిపారు. అనంతరం రైల్వే ఉద్యోగులు, రైల్వే పాఠశాల, కళాశాల విద్యార్థులచే దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ప్రదర్శించిన వివిధ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

