Gurukul Student Death: బాన్సువాడ గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంగీత మృతి ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతికి పరోక్షంగా కారణమైన ఆటో డ్రైవర్ కాశీనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ తో పాటు ప్రిన్సిపల్ సునీతపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ విఠల్ రావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బాన్సువాడ గురుకుల పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని భావించారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం ఆటోలో 30 కూర్చీలను తీసుకెళ్లి పాఠశాల వద్ద దించారు. అయితే స్కూల్లో నలుగురు విద్యార్థినులు ఉండటంతో వారు అదే ఆటోలో హాస్టల్ కు తిరుగుప్రయాణం అయ్యారు. అయితే ఆటో నడుపుతుండగా విద్యార్థినులు ఆటో నుంచి దూకేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
బాన్సువాడ గురుకుల పాఠశాల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు
30 కుర్చీలు తీసుకెళ్లి అన్ లోడ్ చేసిన తర్వాత ఆటోలో నలుగురు అమ్మాయిలు హాస్టల్ కు తిరుగు ప్రయాణం అయ్యారు
డ్రైవర్ చూడకుండా అమ్మాయిలు ఒకరి తర్వాత మరొకరు దూకేశారు
చివరగా దూకిన సంగీత తలకు… https://t.co/DCAYRrE0zK pic.twitter.com/nc1k4DoWAx
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2026
సంగీతకు తలకు తీవ్రగాయం..
తొలుత ముగ్గురు అమ్మాయిలు ఆటో నుంచి దూకేసినట్లు పోలీసులు తెలిపారు. చివరిగా సంగీత కూడా ఆటో నుంచి దూకిందని.. ఈ క్రమంలో ఆమె తలకు బలమైన గాయం తగిలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను హుటాహుటీగా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సంగీత చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారని పోలీసు అధికారులు చెప్పారు. అయితే తొలుత ఇందుకు భిన్నమైన ప్రచారం జరిగింది. బొర్లం క్యాంప్ గురుకుల పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఇంట్లో శుభకార్యం కోసం ఫర్నీచర్ తరలింపు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ప్రిన్సిపల్ సునీత తమ బిడ్డ మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం స్కూల్లో రిపబ్లిక్ వేడుకల ఏర్పాటు కోసం ఆటోలో కూర్చీలు తరలించినట్లు చెప్పడం గమనార్హం.
Also Read: Hyderabad: 46 ఏళ్ల ఆంటీతో.. 23 ఏళ్ల యువకుడు జంప్.. మరీ ఇలా ఉన్నారేంట్రా!
పాఠశాల ఎదుట ధర్నా..
తమ బిడ్డ సంగీత మరణానికి ప్రిన్సిపల్ కారణమంటూ బాలిక కుటుంబ సభ్యులు.. పెద్ద ఎత్తున పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ తన ఇంటి పనుల కోసం విద్యార్థులను ఉపయోగించుకోవడం ఏంటని మండిపడ్డారు. బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడం పోలీసులు రంగ ప్రవేశం చేసి.. తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

