Smart Parking System: గ్రేటర్‌లో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నందున పార్కింగ్ స్థలాలు తల భారంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త భవనాలు అందుబాటులోకి వస్తున్నా, కావల్సిన స్థాయిలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సమస్యకు శాశ్వతంగా కాకపోయినా, కొంత ఊరట కలిగించేలా జీహెచ్ఎంసీ(GHMC) పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్నది. తొలుత మల్టీ లెవెల్ పార్కింగ్‌లను అందుబాటులోకి తేవాలని భావించినా, అది పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు కోర్ సిటీలోని పార్కింగ్ సమస్యను కొంత వరకైనా పరిష్కరించేందుకు స్మార్ట్ పార్కింగ్(Smart Parking)ను తెరపైకి తెచ్చింది.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
ఎక్కువ షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్(Smart Parking)ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. కేబీఆర్ పార్కు,(KBR Park) నిమ్స్, అమీర్ పేట, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్(Smart Parking) ఎంత వరకు సాధ్యాసాధ్యమో తేల్చేందుకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లు ఆహ్వానించగా, స్మార్ట్ సిటీ రంగంలో అనుభవమున్న రెండు సంస్థలు పీపీపీ ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.
జీహెచ్ఎంసీ(GHMC)పై పైసా భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ప్రాతిపదికన స్మార్ట్ పార్కింగ్(Smart Parkingలను అందుబాటులోకి తేవడంతో పాటు దాన్ని నిర్వహించే సంస్థ అడ్వర్‌టైజ్‌మెంట్లతో ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు కొంత వాటా ఆదాయాన్ని జీహెచ్ఎంసీకి కూడా సమకూర్చాలన్న నిబంధనను విధించినట్లు తెలిసింది. స్మార్ట్ పార్కింగ్‌పై సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు వచ్చిన రెండు సంస్థల జాబితాతో పాటు పూర్తి వివరాలను గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు అధికారులు పెట్టనున్నారు.
స్మార్ట్ పార్కింగ్ అంటే?
ఒక ప్రాంతంలో షాపింగ్ ఇతరాత్రా పనులపై వచ్చే వాహనదారుడు, సమీపంలో ఖాళీగా ఉన్న సెల్లార్లు, పార్కింగ్ స్థలాలను వినియోగించుకుని, అక్కడ పార్కింగ్ యార్డును ఏర్పాటు చేసిన వాహనాల డ్రైవర్లకు కనీస మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్, నిమ్స్, అమీర్ పేట, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్ ఎంత వరకు సాధ్యాసాధ్యమో తేలిన తర్వాత పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ స్మార్ట్ పార్కింగ్‌కు సంబంధించి స్పెషల్‌గా ఓ యాప్‌ను కూడా రూపకల్పన చేసి వాహనదారులకు అందుబాటులోకి తెస్తే ఎలాంటి సమస్య లేకుండా నేరుగా వాహనదారుడు, డ్రైవర్ వాహనాన్ని పార్కింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తే సమస్య తగ్గడంతో పాటు రోడ్డుకు అడ్డదిడ్డంగా చేస్తున్న అక్రమ పార్కింగ్‌ను కూడా నివారించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
ఈ స్మార్ట్ పార్కింగ్(Smart Parking)ను ఆఫ్ స్ట్రీట్, ఆన్ స్ట్రీట్ అనే రెండు విధానాలుగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ సంస్థలు, హాస్పిటల్స్ వంటి వాటికి వచ్చే కార్లు వంటి వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఆఫ్ స్ట్రీట్ కింద ప్రైవేట్ సెల్లార్లు, స్టిల్ట్‌లను పార్కింగ్ కోసం వినియోగించనున్నారు. సమీపంలోని పాతకాలపు, వినియోగంలో లేని భవనాల స్థలాలను స్మార్ట్ పార్కింగ్(Smart Parking) కోసం వినియోగించేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీంతో పాటు రోడ్లకిరువైపులా ఉండే ఖాళీ ప్రదేశాలు, సమీపంలోని ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలను కూడా ఆన్ స్ట్రీట్ ప్రాతిపదికన వినియోగించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి, నేటి స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
టెక్నాలజీ వినియోగంతో సమస్యకు చెక్
ముఖ్యంగా వీధుల్లో వాహనాల అక్రమ పార్కింగ్ నివారణతో పాటు టెక్నాలజీని వినియోగించుకుని వాహనదారుడికి అవసరమైన చోట పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాన్ని అందుబాటులో ఉంచాలన్నది ఈ స్మార్ట్ పార్కింగ్(Smart Parking) ముఖ్య ఉద్దేశం. ఎఫెక్టివ్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తప్పకుండా అమలయ్యేలా సంస్థలు టెక్నాలజికల్ కంపోనెంట్స్‌ను సమకూర్చుకొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రాంతానికి వచ్చే కారు వంటి వాహనంలో వచ్చిన డ్రైవర్ గానీ, వినియోగదారుడుకి పార్కింగ్ అక్యుపెన్సీ తెలిసే విధంగా సెన్సార్లు వంటివి ఏర్పాటు చేసుకుని ఈ వ్యవస్థ నిర్వహణ చేపట్టాల్సి ఉంది. ఈ పార్కింగ్‌కు సంబంధించి మున్ముందు మొబైల్ యాప్, సర్వైలెన్స్ కెమెరాలు, డిస్ ప్లే బోర్టు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వంటివి అందుబాటులో ఉండాలన్న నిబంధనతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.