Serilingampalli: నకిలీ పత్రాలు సృష్టించి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న భారీ (ఆరంతస్తుల) నిర్మాణాన్ని శనివారం శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నెంబర్లో ఉన్న 300ల గజాల స్థలం నానిశెట్టి ప్రమీల పేరుతో ఉంది. కాగా ప్రమీల మరణించడంతో సదరు బిల్డర్ ప్రమీల సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను తయారు చేశారు.
సృష్టించిన పత్రాలతో గోల్కొండ రమేష్ పేరీట జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో స్టిల్ట్ ప్లస్ 3 భవన నిర్మాణ అనుమతులు తీసుకునీ, నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాగా నిర్మాణం కొనసాగుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రమీల కుటుంబ సభ్యులు కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు సదరు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సదరు బిల్డర్ నిర్మాణ పనులు కొనసాగిస్తుండడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: Covid-19 Cases TG: రాష్ట్రంలో కరోనా భయాలు.. మంత్రి కీలక ఆదేశాలు!
ఈ నెల 20న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు, గచ్చిబౌలి పోలీసుల బందోబస్తు మధ్య శనివారం సదరు భవనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన వారిలో టౌన్ ప్లానింగ్ ఏసిపీ వెంకట రమణ, టీపీఎస్ సంతోష్ కుమార్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్, తదితరులున్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ రాజరాజేశ్వరి నగర్ కాలనీలో శనివారం అధికారులు సీజ్ చేసిన భవనానికి స్టీల్ ప్లస్ త్రీ అంతస్తుల అనుమతులు ఉన్నాయి. ఓవైపు సదరు ప్లాట్ అసలు యజమానులు భవన నిర్మాణం పై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. కనీసం అనుమతులకు మించి నిర్మిస్తున్న సంగతిని కూడా గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది.
తమ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించి, అనుమతులు పొందారంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న పట్టించుకోకుండా వ్యవహరించడం వెనక మర్మమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశిస్తే తప్ప టౌన్ ప్లానింగ్ అధికారులు పనులు చేయరా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన మొత్తం వస్తే అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడరంటూ ప్రజల ఆరోపిస్తున్నారు.
Also Read: CM Revanth On KCR: అసెంబ్లీకి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం.. కేసీఆర్‌కు సీఎం విజ్ఞప్తి