SC on HCU Land(image credit:X)
హైదరాబాద్

SC on HCU Land: దూకుడు పెంచిన సుప్రీం.. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై కీలక అప్‌డేట్..

SC on HCU Land: కోర్టు తీర్పు ద్వారానే ప్రభుత్వానికి వచ్చిన నాలుగు వందల ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక ట్విస్ట్ ల ద్వారా వివాదాస్పదమైన ఈ భూములపై సుప్రీం కోర్టు మాత్రం దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతవారం సుమోటోగా కేసును స్వీకరించి అక్కడ జరుగుతున్న పనులపై తక్షణం స్టే విధించింది సుప్రీం కోర్టు. ఆ సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలకు అనుగుణంగానే సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని హైదరాబాద్ కు పంపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

చైర్మన్ సిద్దాంత్ దాస్ నేతృత్వంలోని మరో నలుగురు సభ్యుల కేంద్ర సాధికార సంస్థ (సీఈసీ) ఈ నెల తొమ్మిది సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం పదవ తేదీ ఉదయం ఈ కమిటీ కంచ గచ్చిబౌలిలో వివాదాస్పద ప్రాంతంలో పర్యటిస్తుంది. అవసరం అయితే పదకొండున కూడా కమిటీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీతో పాటు, ప్రభుత్వానికి చెందిన నాలుగు వందల ఎకరాలను కూడా ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

అవసరమైతే యూనివర్సిటీ పాలకమండలి, విద్యార్థులు, పౌర సమాజం నుంచి కూడా వినతులు స్వీకరించే అవకాశముంది. మొన్నటి ఉత్తర్వుల్లోనే కమిటీ పర్యటన, పరిశీలించాల్సిన అంశాలు, నివేదికపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Also read: Vishaka Tragedy: స్విమ్మింగ్ కు వెళ్లిన ఏడేళ్ల బాలుడు మృతి.. విశాఖలో ఘటన..

కంచె గచ్చిబౌలి భూములు ఏ పరిధిలోకి వస్తాయి, అక్కడ ఉన్నట్లుగా చెబుతున్న చెట్లు, పర్యావరణం, జంతుజాలం వివరాలను కమిటీ నమోదుచేస్తుంది. ప్రదేశాన్ని చదును చేయటానికి ముందే పర్యావరణ మదింపు ఏమైనా జరిగిందా, చెట్లను తొలగించేందుకు అటవీశాఖ నుంచి అనుమతి తీసుకున్నారా, ఒక వేళ చెట్లను తొలగిస్తే ఉన్నటువంటి పక్షులు, జంతుజాలం విషయంలో తీసుకున్న ముందస్తు చర్యలేమిటి, నీటి వనరుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలను లోతుగా ఎంపవర్ కమిటీ పరిశీలించనుంది.

అదే సమయంలో ప్రభుత్వం కూడా పూర్తి వివరాలతో ఈ నెల 16 లోపు అఫిడవిట్ ను సుప్రీంకు సమర్పించాల్సి ఉంది. దీనిపై కూడా చీఫ్ సెక్రటరీతో సహా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ రోజూ ఆ ప్రాంతానికి వెళ్తున్న ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న దశ నుంచి సమస్యను ఎలా బయటపడవేయటం అన్నదానిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. తుంపర చెట్లతో చిట్టడవిగా ఆ ప్రదేశం మారిందే తప్ప, అడవిని తలపించే భారీ వృక్షాలు లేవనేది అధికారుల వాదన.

అదే సమయంలో చుట్టూ భారీగా జరిగిన పట్టణీకరణ వల్ల భవన వ్యర్థాలు భారీగా ఆ ప్రాంతంలో పోగుపడ్డాయని కూడా అంటున్నారు. ఈ మొత్తం విషయాలను కూడా కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లేలా అధికారులు నివేదికను తయారు చేస్తున్నారు. మొన్న సుప్రీం కోర్టు గంటల వ్యవధిలోనే నివేదిక కోరటంతో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడటానికి కారణమైందని ప్రభుత్వ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏమిటి, ఏం చేస్తుంది..??
అటవీ, పర్యావరణ వివాదాలు చూసేందుకు పాతికేళ్ల కిందట సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని నియమించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో తలెత్తే అటవీ, పర్యావరణ పరమైన వివాదాలను కూలంకషంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో పర్యటించి నిపుణులైన చైర్మన్, సభ్యులతో కూడిన ఈ కమిటీ నివేదికలు తయారు చేస్తుంది.

వివిధ అటవీ, పర్యావరణ కేసుల్లో ఈ కమిటీ ఇచ్చే నివేదికను సుప్రీం కోర్టు ప్రామాణికంగా స్వీకరిస్తుంది. గతంలో పోలవరం, కొల్లేరు లాంటి ప్రాంతాల్లో ఈ తరహా వివాదాలు ఏర్పడినప్పుడు ఎంపవర్డ్ కమిటీ నివేదికలు ఇచ్చింది. మహారాష్ట్రలో మెట్రో కోసం చెట్లు నరికిన కేసులోనూ ఈ కమిటీ నివేదిక కీలకం అయింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన నివేదికలను సుప్రీంకోర్టు సానుకూలంగా స్వీకరిస్తుంది. వాటి ఆధారంగానే తదుపరి ఉత్తర్వులు ఇస్తుంది.

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు