Vishaka Tragedy: సరదాగా స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన ఓ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఈత సరదా కోసం స్విమ్మింగ్ పూల్ కు వెళ్లి బాలుడు మృత్యు ఒడికి చేరడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది.
విశాఖపట్నం లోని పోర్టు స్టేడియంలో విశ్వనాథ్ ఆక్వా వరల్డ్ వాటర్ పార్కు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడికి అధిక సంఖ్యలో చిన్నారులు ఈత సరదా తీర్చుకునేందుకు వస్తుంటారు. అదే రీతిలో మురళి నగర్ కు చెందిన గంగాధర్, కల్పన దంపతుల కుమారుడు రుషి(7) సోమవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆక్వా వరల్డ్ పార్క్ లోకి వెళ్ళాడు. ఈ పార్కులోకి పెద్దలకు ప్రవేశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బయట ఉన్న పరిస్థితి.
అయితే రుషి ఈత సరదా తీసుకునేందుకు నీటిలోకి వెళ్ళగా ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. దీనితో విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది వెంటనే బాలుడిని ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan Son Injured: పవన్ కుమారుడికి తీవ్రగాయాలు.. పూజల్లో పవన్, గ్రామస్తులు
ప్రస్తుతం బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. అయితే బాలుడు మృతికి కారణం విశ్వనాధ్ ఆక్వా వరల్డ్ వాటర్ పార్క్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని, పెద్దలకు ప్రవేశం లేకపోవడంతో అత్యంత జాగ్రత్తగా పిల్లలపై దృష్టి సారించాల్సిన విషయాన్ని సిబ్బంది పక్కన పెట్టారంటూ బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద పిల్లవాడి ఈత సరదా తీర్చేందుకు కుటుంబ సభ్యులు స్విమ్మింగ్ పూల్ కు తీసుకువెళ్లగా, దురదృష్టవశాత్తు రుషి మృతి చెందడం తో వారి రోదనలు మిన్నంటాయి.