Sankranti Safety Alert: సంక్రాంతి సంబరాల్లో పతంగులు ఎగురవేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కోరారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగురవేయడం ప్రాణాపాయానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. వరుస సెలవులు ఉండటంతో పిల్లలు ఆనందోత్సవాల మధ్య భద్రతను విస్మరించకూడదని, ఎగురవేసే ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
విద్యుత్ లైన్లకు దూరంగా
విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల సమీపంలో పతంగులు ఎగురవేయడం వల్ల విద్యుత్ అంతరాయం కలగడమే కాకుండా భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. పతంగులు లేదా మాంజాలు లైన్లపై పడితే వాటిని తీసే ప్రయత్నం చేయవద్దని, అలా చేయడం వల్ల తీగలు ఒకదానికొకటి తాకి ప్రాణాపాయం కలుగుతుందని వివరించారు. మైదానాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని, బాల్కనీలు లేదా గోడల పైనుంచి ఎగురవేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
Also Read:Medaram Jatara 2026: మేడారం జాతరపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఫోకస్.. 30 మెడికల్ క్యాంపుల ఎర్పాటుతో పాటు..?
నిషేధిత మాంజాలు వాడొద్దు
పతంగుల కోసం కాటన్, నైలాన్ లేదా లినెన్ దారాలను మాత్రమే వాడాలని, మెటాలిక్ మాంజాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆయన సూచించారు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కావడంతో వాటి ద్వారా కరెంటు షాక్ తగిలే ప్రమాదం ఉందన్నారు. అలాగే, తెగిపడిన మాంజాలను తొలగించేందుకు విద్యుత్ శాఖ 6 నుండి 18 అడుగుల వరకు పొడిగించగల అత్యాధునిక ఇన్సులేటెడ్ రంపం మెషిన్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీటి ద్వారా విద్యుత్ సరఫరా ఆపకుండానే లైన్లపై ఉన్న మాంజాలను తొలగించవచ్చని పేర్కొన్నారు.
అత్యవసర సమాచారం కోసం 1912
పతంగి మాంజాలు విద్యుత్ తీగలకు చుట్టుకున్నా లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనా వెంటనే సమీప విద్యుత్ కార్యాలయానికి గానీ, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912 కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని ముషారఫ్ ఫారూఖీ సూచించారు. అలాగే సంస్థ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. పండుగ సమయంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, తెగిపడిన తీగలను ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

