Sankranti Traffic: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి, కేతేపల్లి వద్ద కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో టోల్ గేట్ దాటడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెకండ్ శనివారం కావడంతో..
హైదరాబాద్ వాసులు ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున తమ సొంతూర్లకు వెళ్తుంటారు. బస్సులు, రైళ్ల టికెట్లు ముందే బుకింగ్స్ అయిపోవడంతో చాలా మంది తమ సొంతవాహనాల్లోనే ఊరికి పయనమవుతున్నారు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కలిసి రావడంతో మరింత ఉత్సాహంగా ఆత్మీయులు కలిసేందుకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్ లోని ఏపీ వాసులు ఒకేసారి.. ఏపీలోని స్వస్థలాలకు వెళ్తుండటంతో సహజంగానే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
సంక్రాంతి పండుగ వేళ పట్నం నుంచి పల్లె బాట పడుతున్న జనం
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సేమ్ సీన్
ఇటు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపైనా భారీగా వాహనాల రద్దీ
టోల్ గేట్లను దాటేందుకు రెండు గంటల సమయం… pic.twitter.com/E1wtxn9Ix6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2026
ప్రత్యేక ఏర్పాట్లు..
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంచికర్ల పోలీసులు… కీసర టోల్ ప్లాజా వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఫాస్ట్ టాగ్ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. 4 సెకన్లకే ఒక వాహనం టోల్ బూత్ దాటేలా చర్యలు చేపట్టారు. అటు హైదరాబాద్ – విజయవాడ రహదారిలోని మిగతా టోల్ ప్లాజా వద్ద కూడా ఈ తరహా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.
భారీ క్రేన్స్ మోహరింపు..
హైవేపై రద్దీ ఉన్న సమయంలో పెద్ద పెద్ద వాహనాలు ఆగిపోతే ఇంకెంత ఇబ్బంది తలెత్తుతుందో అందరికీ తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన జంక్షన్లు, వంతెనల వద్ద భారీ క్రేన్స్ ను అందుబాటులో ఉంచుతున్నారు. సాంకేతిక సమస్యతో ఏదైనా వాహనం ఆగిపోతే.. వెంటనే ఈ క్రేన్ సాయంతో వాహనాన్ని పక్కకు తీయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా హైవేపై పెట్రోలింగ్ బృందాలు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
Also Read: YouTuber Arrest: మైనర్లతో అసభ్య ఇంటర్వ్యూలు.. ఏపీ యూట్యూబర్ అరెస్టు
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
హైదరాబాద్ – విజయవాడ హైవేపై తెల్లవారుజాము నుంచే రద్దీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొగమంచు ప్రభావం అధికంగా ఉన్నందున వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ్ల మంచు ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయాల్లో సొంత వాహనాల్లో బయలుదేరవద్దని సూచిస్తున్నారు. ఆత్మీయుల వద్దకు త్వరగా వెళ్లడం కన్నా.. క్షేమంగా వెళ్లడం చాలా ముఖ్యమన్న విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు.

