Temple Land: ఆలయ భూములు ఆలయానికి దక్కేనా?
కబ్జాకు గురైన భూములపై సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
మేడ్చల్ స్వేచ్ఛ: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఉన్న జనప్రియ వెంచర్‌లో కబ్జాకు గురైన సీతారాముల ఆలయ భూములు, ప్రభుత్వ భూముల అంశంపై రెవెన్యూ శాఖ స్పందించింది. సర్వేయర్ వినోద్(Vinod) ఆధ్వర్యంలో ఆలయ భూములతో పాటు ప్రభుత్వ భూములపై తాజాగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదిక వారం రోజులలో అందనుందని అధికారులు తెలిపారు. ఆలయ భూములు తిరిగి ఆలయానికి దక్కుతాయా? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అనే అంశాలపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.
జనప్రియ వెంచర్ నేపథ్యం
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జనప్రియ వెంచర్(Janapriya Venture) సుమారు 15 ఎకరాలు 3 గుంటల స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ స్థలాన్ని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకుంది. అయితే ఈ వెంచర్ పరిధిలోని 217, 218 సర్వే నెంబర్లలో సీతారాముల ఆలయానికి చెందిన సుమారు ఎకరం 20 గుంటల భూమితో పాటు ప్రభుత్వ భూమి కూడా ఉన్నట్లు గ్రామస్తులు మొదటి నుంచే ఆరోపిస్తున్నారు. గతంలో అప్పటి మేడ్చల్ తహసిల్దార్ శైలజ(MRO Shialaja) విచారణ జరిపి, 218 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించి అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే సీతారాముల ఆలయానికి చెందిన ఎకరం 20 గుంటల భూమి విషయంలో స్పష్టత రాలేదు.
Also Read: US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు
ఫిర్యాదుతో కదిలిన రెవెన్యూ శాఖ
ఇటీవల అదే గ్రామానికి చెందిన బిక్షపతి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. సర్వేయర్ వినోద్(Surveyor Vinod)ఆధ్వర్యంలో ఆలయ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే చేపట్టారు. సర్వే నివేదిక రాగానే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా జనప్రియ వెంచర్ ఆధీనంలో ఉన్న సీతారాముల ఆలయ భూములకు విముక్తి కలుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ భూములు ఆలయానికి అప్పగించాలి
జనప్రియ వెంచర్ ఆధీనంలో ఉన్న సీతారాముల ఆలయ భూములను స్వాధీనం చేసుకుని ఆలయానికి అప్పగించాలని అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత బిక్షపతి డిమాండ్ చేశారు. ప్రస్తుతం వెంచర్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్‌లోనే ఆలయ భూములు ఉన్నాయని, తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఇకనైనా ఆలయ భూములను ఆలయానికి అప్పగించాలని కోరారు.అలాగే వెంచర్‌లో ఉన్న ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

