Uttam Kumar Reddy: కృష్ణా బేసిన్ జల ద్రోహులు బీఆర్ఎస్ నేతలేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం శాసనసభలో కృష్ణా నదీ జలాల హక్కులపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోందే తప్ప, వాస్తవానికి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నీటి వాటాలను అంగీకరిస్తూ సంతకాలు చేశారని మంత్రి గుర్తు చేశారు. కేవలం 34 శాతం నీళ్లు తెలంగాణకు సరిపోతాయని కేసీఆర్, హరీశ్ రావులు అంగీకరించడం తెలంగాణకు మరణశాసనం రాసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ఇరిగేషన్ పేరుతో రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా, కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు 783 టీఎంసీల నీటిని (మొత్తం కేటాయింపుల్లో సుమారు 71 శాతం) కేటాయించాలని ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోందని ఉత్తమ్ తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 73 శాతానికి పైగా భూభాగం తెలంగాణలోనే ఉందని, కాబట్టి న్యాయమైన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. నదీ జలాల సమస్యలపై పరిష్కారానికి ఎవరితోనైనా చర్చకు తాము సిద్ధమని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.
పాలమూరుపై కేసీఆర్ మోసం
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ. 83 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందని, అయితే మూడేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేవలం 35 శాతం పనులే పూర్తి చేసిందని ఉత్తమ్ విమర్శించారు. కుర్చీ వేసుకుని కూర్చుంటా అని కేసీఆర్ అన్నారని, ఆ కుర్చీ ఎక్కడ పోయిందో, ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రూ. 41 వేల కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మాత్రం రూ. 1.20 లక్షల కోట్లను వెచ్చించిందని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ కూడా అదనంగా పెంచలేకపోయారని విమర్శించారు. అదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో 1.5 టీఎంసీల సామర్థ్యాన్ని 1 టీఎంసీకి తగ్గించి అన్యాయం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు.
చారిత్రక తప్పిదాలను సవరిస్తున్నాం
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో వెలువడనుందని మంత్రి తెలిపారు. తాను స్వయంగా ట్రిబ్యునల్ వాదనలకు హాజరవుతున్నానని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 72 శాతం (814 టీఎంసీల్లో న్యాయమైన వాటా) కేటాయింపులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకుని చారిత్రక తప్పిదం చేశారని, దానిని తాము సవరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఈ టర్మ్‌లోనే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015లో జీవో ఇచ్చి, డీపీఆర్ సమర్పించడానికి ఏడేళ్లు సమయం తీసుకున్నారని మంత్రి మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తెస్తే రూ. 32 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును, శ్రీశైలంకు మార్చడం వల్ల వ్యయం రూ. 80 వేల కోట్లకు పెరిగిందని విమర్శించారు. కేసీఆర్ 90 శాతం పనులు అన్నారని, కానీ జరిగింది 30 శాతమేనని ఎద్దేవా చేశారు. ఇంకా 17 క్లియరెన్సులు రావాల్సి ఉందని, 39 వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని తెలిపారు.
Also Read: Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి
ఏపీ ప్రాజెక్టులపై పోరాటం..
పోలవరం-నల్లమల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లేదని, దీనిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని మంత్రి చెప్పారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, తాము కృష్ణా బేసిన్ రైతులకు న్యాయం చేసిన తర్వాతే ఔటర్ బేసిన్‌కు నీటిని తీసుకెళ్లేలా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామని వెల్లడించారు.
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
సభలో శనివారం ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న పోలవరం-నల్లమల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదని, అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తమ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతమని, ఇక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సభ అభిప్రాయపడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో సరైన పురోగతి లేకపోవడం వల్ల అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయని తీర్మానంలో పేర్కొన్నారు. 90 టీఎంసీల సామర్థ్యంతో తాగు మరియు సాగునీటి కోసం చేపట్టిన ఈ స్కీంకు సంబంధించిన అన్ని అనుమతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని శాసనసభ కోరింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు లేదా పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. గోదావరి జలాలను ఏ రూపంలో తరలించినా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ తీర్మానం కాపీలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం.
100 పేజీలతో పీపీటీ
కృష్ణా నది జలాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఉత్తమ్ వినూత్నంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా 100 పేజీలతో కూడిన సమగ్ర వివరాలను సభ్యులకు వివరించారు. సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ ప్రజెంటేషన్‌లో 2014 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన నీటిపారుదల విధానాలను మంత్రి ఎండగట్టారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని మంత్రి విమర్శించారు. చేసిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం కూడా ఏడాదిలోపే కూలిపోయిందని ఆరోపించారు. నదీ జలాల పంపకాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందనే అంశాన్ని ఒప్పందాల ఆధారంగా వివరించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయని అయిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి మండిపడ్డారు. కేవలం డీపీఆర్ సిద్ధం చేయడానికే ఏడేళ్ల సమయం తీసుకున్నారని, ఇది ఆ జిల్లాల పట్ల గత పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని, నదీ జలాల్లో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన సుదీర్ఘంగా వివరించారు.
సభ వాయిదా
శాసనసభ సమావేశాలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి సభ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. అంతకుముందు శనివారం నాటి సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కీలక బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ (పబ్లిక్ సర్వీస్ నియామకముల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపము) (సవరణ) బిల్లు – 2026 : ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, సిబ్బంది వేతనాలకు సంబంధించి చేసిన సవరణలకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ (రెండవ సవరణ) బిల్లు – 2026: ఇదే అంశంపై ఉన్న రెండవ సవరణ బిల్లును కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు – 2026 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఈ సవరణను ప్రభుత్వం తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్ (రెండవ సవరణ) బిల్లు – 2026: ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేలా ఈ సవరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సవరణ బిల్లుల ఆమోదంతో రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగినట్లయింది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును దృష్టిలో ఉంచుకుని ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ మంత్రి సీతక్క ఈ బిల్లులను ప్రవేశపెట్టగా, సభ దీనిని స్వాగతించింది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడుగులు.. ఇన్‌టైమ్‌లోనే పూర్తి చేసేలా సర్కార్ చర్యలు!

