Veterinary Employees Protest: రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా పశు వైద్యాధికారిపై ఉద్యోగులు, సిబ్బంది నిరసన రాగం అందుకున్నారు. విధి నిర్వహణలో కక్ష్య సాధింపుగా వ్యవహరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్టేట్ ఆఫీస్ నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ బాబు బేరి రెండు నెలలగా రంగారెడ్డి జిల్లా పశు వైద్యాధికారిగా ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందిని దుర్భాషలాడుతూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కార్యాయంలో జరిగిన సమావేశంలో సైతం రభస చోటుచేసుకోగా మూకుమ్మడిగా ఉద్యోగులంతా(Employs) జిల్లా పశు వైద్యాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తనిఖీల పేరుతో అనుచితంగా
ఆకస్మిక తనిఖీల పేరుతో జిల్లా పశు వైద్యాధికారి(District Veterinary Officer) అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రోజుకో కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందులుకు గురి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రతి రోజు ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఫోటోలు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయాలని, లేకపోతే విధులకు హాజరుకాలేదన్నట్లేనని జిల్లా వైద్యాధికారి హుకుం జారీ చేస్తున్నారని మండి పడుతున్నారు. తనిఖీల పేరుతో మహిళా వైద్యులతోనూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వారు వాపోతున్నారు.
ఆసుపత్రుల తనిఖీల సందర్భంగా వచ్చినప్పుడు గ్రామస్తుల ముందు ఉద్యోగులను బహిరంగంగానే దూషిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. వ్యంగ్యంగా, అగౌరవ వ్యాఖ్యలు చేస్తుండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీసేలా పెద్ద సారు వ్యవహరిస్తుండడంతో స్వేచ్చగా విధులు నిర్వర్తించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఉద్యోగుల(Employ) పట్ల వివక్షిత పూరితంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగుల కులం, ఇతర వ్యక్తిగత వివరాలను అడగడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. ఆ దేశాలకు మళ్లీ విమాన సేవలు!
ఉన్నతాధికారులకు చేరిన పంచాయతీ
గత కొంతకాలంగా జిల్లా పశు వైద్యాధికారికి ఉద్యోగులకు మధ్య సాగుతున్న పంచాయతీ చివరకు ఉన్నతాధికారులకు చేరింది. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని వెటర్నరీ కార్యాలయంలో ఉద్యోగులతో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బాబు బేరి(Babu Berey) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులంతా తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)ఏడీఏగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తన బాధలు చెప్పుకుని కన్నీళ్ల పర్యంతమైంది. వెటర్నరీ అసిస్టెంట్‌ను డిప్యూటేషన్‌పై పంపించడంతోపాటు, ఉన్న ఒక్క అటెండర్‌ను కారు డ్రైవర్‌గా జిల్లా అధికారి తీసుకోవడంతో తాను ఒక్కరే విధులు నిర్వర్తించడం కష్టమవుతోందని సదరు మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
పే బిల్స్‌కు ట్రెజరరీ కార్యాలయానికి కూడా తానే వెళ్లాల్సి వస్తోందని చెప్పుకుని కంటతడి పెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లా అధికారికి ఉద్యోగులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణలో డాక్టర్ బాబు బేరికి సంబంధించిన సెల్‌ఫోన్ కిందపడి పగిలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత ఉద్యోగులంతా స్టేట్ కార్యాలయానికి వెళ్లి డైరెక్టర్‌కు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది అంతా మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాధికారిని కొనసాగిస్తే తామంతా సామూహికంగా సెలవులపై వెళ్తామని ఈ సందర్భంగా ఉద్యోగులు తేల్చి చెప్పారు.
కలెక్టర్ ఆదేశాను సారమే డాక్టర్ బాబు బేరి
జిల్లా వెటర్నరీ అధికారికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్న వివాదంపై ‘స్వేచ్చ’ ప్రతినిధి వివరణ కోరగా జిల్లా వెటర్నరీ అధికారి బాబు బేరి స్పందించారు. ప్రతి రోజు డ్యూటీలో ఉన్నట్లుగా వాట్సాప్‌లో ఫోటోలు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని, ఆ ప్రకారమే తాను వ్యవహరించినట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా వెలుగు జూస్తున్న ఉద్యోగుల నిర్లక్ష్యంపై ప్రశ్నించడం వల్లనే కొంతమంది తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: Marriage: ఏంటిది భయ్యా.. మగాళ్లను బతకనివ్వరా?