Ramachandra Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కీలకమైన సమావేశానికి ఆ పార్టీ కార్పొరేటర్లు పలువురు గైర్హాజరవ్వడంతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) గుస్సా అయినట్లు తెలిసింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాగ్యనగరంలోని 8 జిల్లాల ప్రధాన నాయకులతో రాంచందర్ రావు అధ్యక్షతన శుక్రవారం జూబ్లీహిల్స్(Jublihills) అసెంబ్లీ ఉపఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహంచారు. కాగా ఈ మీటింగుకు దాదాపు 12 మంది గైర్హాజరైనట్లు సమాచారం. దీంతో రాని వారిపై కమల దళపతి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.
ఎవరినీ బొట్టు పెట్టి పిలిచేది లేదు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటిదని, ఈ గెలుపే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిలకు మార్గం సుగమం చేస్తుందని, ఇంత కీలక మీటింగుకు రాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సొంత ఎలక్షన్ లా ఫీలవ్వాలని రాంచందర్ రావు వారికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఎవరినీ బొట్టు పెట్టి పిలిచేది ఉండబోదని, ప్రతి ఒక్కరూ స్వతహాగా వచ్చి ప్రచారం చేయాల్సిందేనని, లేదంటే పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లు వినికిడి. గ్రేటర్లో కార్పొరేటర్ టికెట్ కావాలన్నా.. కాషాయ జెండా ఎగరాలన్నా ఎవరికి వారు వారి పరిధి దాటి రావాలని సూచించినట్లు తెలిసింది.
Also Read: TG High Court: హైకోర్టు సంచలన తీర్పు.. బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై స్టే
సాయంత్రం పూర్తిస్థాయిలో..
రోజుకు కనీసం 2 గంటలైనా బైపోల్ ప్రచారానికి కేటాయించాలని ఆదేశించినట్లు సమాచారం. కార్పొరేటర్లపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందని చెప్పినట్లు టాక్. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress), ఎంఐఎం(MIM) ఒక్కటేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని 8 జిల్లాల నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని. మధ్యాహ్నం సమయంలో ఓటర్స్ ఫోన్ నంబర్లు తీసుకొని స్వయంగా నాయకులే మాట్లాడాలని రాంచందర్ రావు ఆదేశించినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరన్నది పార్టీ చూసుకుంటుందని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. కాగా ఈ ఉప ఎన్నికలకు కార్పొరేటర్లు, ఇతర నాయకులు సీరియస్ గా తీసుకుని గ్రౌండ్ లెవల్లో పనిచేస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.
Also Read; Prabhas leaked video: ‘ది రాజాసాబ్’ నుంచి వీడియో వైరల్.. ఇక లాఫింగ్ జాతరే..
