Hydraa: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల కబ్జాలను తొలగిస్తూ, నగర ప్రజల సమస్యలను తక్కువ సమయంలోనే పరిష్కరిస్తూ ఎక్కువ ప్రజాభిమానాన్ని పొందిన హైడ్రాకు రోజురోజుకీ ప్రజల మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా, పలు చెరువులు, పార్కులకు సంబంధించిన కబ్జాలపై ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు చేసి విసిగిపోయిన బాధితులు చివరి ప్రయత్నంగా హైడ్రాను ఆశ్రయించగా, వారి సమస్యలు పరిష్కారమై కబ్జా భూములకు విముక్తి లభించడంతో ఫిర్యాదుదారులు హైడ్రాకు అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు హైడ్రాపై దుష్ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేక, ప్రజలు వివిధ రకాలుగా హైడ్రాకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, గతంలో వరద ముప్పుతో అల్లాడిన అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజలు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. వరద ముప్పును తప్పించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు.
ర్యాలీగా వచ్చి..
అమీర్‌పేట మైత్రీవనం వద్దకు శ్రీనివాస్ నగర్, గాయత్రి నగర్, కృష్ణానగర్, అంబేద్కర్ నగర్ కాలనీల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి, ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు. కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడితే అతలాకుతలం అయిన తమ కాలనీలకు, హైడ్రా చర్యల వల్ల ఈసారి 15 సెంటీమీటర్ల వర్షం పడినా వరద ముప్పు తప్పిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. గతంలో నడుములోతు నీళ్లు నిలిచిపోయే మైత్రీవనం వద్ద, హైడ్రా వచ్చి భూగర్భ పైపులైన్లలోని పూడికను తొలగించినందున ఈసారి నీరు నిలవలేదని చెప్పారు. అంతేకాక, నాలాల్లో పూడిక పేరుకుపోవడంతో అంబేద్కర్ నగర్‌లో డ్రైనేజీ నీరు రోడ్డు మీద పారే సమస్య కూడా హైడ్రా చర్యలతో పరిష్కారమైందని స్థానికులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా ఇక్కడకు వచ్చి సమస్యను తెలుసుకుని, దాని పరిష్కార బాధ్యతను హైడ్రాకు అప్పగించారని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనేక సార్లు పరిశీలించి శాశ్వత చర్యలు తీసుకున్నారని వారు అభినందించారు.
Also Read: Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..
నాలా విస్తరణతో ఉపశమనం
ప్యాట్నీ పరిసర కాలనీల ప్రజలు కూడా ర్యాలీగా వచ్చి హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్యాట్నీ నాలాను విస్తరించి, పైన ఉన్న ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పును హైడ్రా నివారించిందని స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వర్షం వస్తే వణుకు వచ్చేదని, ఇంట్లోని సామాన్లు వరద నీటిలో మునిగిపోయేవని, అయితే ఈ ఏడాది ఆ సమస్యలేమీ ఎదురు కాలేదని పేర్కొన్నారు. ప్యాట్నీ వద్ద 70 అడుగుల నాలా 15 నుంచి 18 అడుగులకు కుంచించుకుపోవడంతో ఇబ్బంది ఉండేదని, హైడ్రా వచ్చి నాలాను వాస్తవ వెడల్పునకు విస్తరించడంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు. 30 ఏళ్లుగా ఉన్న ఈ సమస్య వల్ల వర్షం వస్తే తమ కార్లన్నీ మునిగిపోయి లక్షల రూపాయల నష్టం జరిగేదని, దశాబ్దాల సమస్యను ఒక్క ఫిర్యాదుతో వెంటనే హైడ్రా పరిష్కరించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Cold Wave Weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి
