JubileeHills bypoll: టీడీపీ మద్దతుపై బీజేపీలో కన్ఫ్యూజన్!
ఒకరుందంటే మరొకరు లేదంటూ వ్యాఖ్యలు
సపోర్ట్ ఇస్తున్నట్లు జనసేన క్లారిటీ
ఆయన ఫొటో చూసి అయినా ఇండస్ట్రీ ఓట్లేస్తుందా?
సినిమా వాళ్లతో కాంగ్రెస్‌కు కయ్యం
అల్లు అర్జున్ జైలు ఎపిసోడ్, నాగార్జున ఎన్-కన్వెన్షన్ కూల్చివేత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (JubileeHills bypoll) టీడీపీ మద్దతుపై బీజేపీ నేతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే, ఒక నేత మద్దతిచ్చారని చెబుతుంటే మరో నేత మాత్రం రేపో మాపో మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా టీడీపీ మద్దతు ప్రకటించిందని ఇటీవల చెప్పుకొచ్చారు. కేడర్ ఇంటర్నల్‌గా కార్యకర్తలకు చెప్పిందని పేర్కొన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాత్రం రేపో మాపో మద్దతు ప్రకటిస్తుందని చెప్పడం గమనార్హం. ఒకరు ఉందంటే.., మరొకరు లేదని చెప్పడంతో నేతల మధ్య సమన్వయం కొరవడిందా? అనే అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా, జనసేన తరపున ఆ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జీ అధికారికంగా ప్రకటించారు. కానీ, టీడీపీ నుంచి మాత్రం అలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో వారి మద్దతు బీజేపీకి దక్కుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఉపఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరును పెంచాయి. ప్రచారానికి మరో మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలుండటంతో దూకుడు పెంచాయి. ఈనెల 9 నాటికి ప్రచారం ముగియనుంది. దీంతో ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయితే, ఈ విషయంలో ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ మొదటి నుంచి కాస్త వెనుకంజలోనే ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు తోడు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుపైనా కాస్త డైలమా ఏర్పడింది. ఈ సందిగ్ధతకు జనసేన ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. కానీ, టీడీపీ ఇవ్వకపోవడం కొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే టీడీపీ, జనసేన.. ఎన్డీయే భాగస్వామ్యంలో ఉన్నాయి. దీనికి తోడు జూబ్లీహిల్స్‌లో ఈ రెండు పార్టీల ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఏపీ సెటిలర్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఇక్కడే నివసిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఉప ఎన్నిక జరుగుతుంటే మద్దతుపై టీడీపీ మౌనంగా ఉండటం గమనార్హం.
Read Also- Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు బీజేపీకి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రచారానికి మూడ్రోజులే మిగిలివున్న తరుణంలో ఇప్పుడు ప్రకటించినా జనసేన అనుకున్నంత ప్రభావితం చేయగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే జనసేన నుంచి చెప్పుకోదగిన స్థాయి నేత తెలంగాణలో ఎవరూ లేకపోవడమే దీనికి కారణం. అయితే జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చరిష్మా అయినా ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ బైపోల్ ప్రచారానికి రావడం ఏమాత్రం కుదరదు. కేవలం ఆయన ఫొటో చూసి ఇండస్ట్రీకి చెందిన వారు బీజేపీకి ఓట్లు వేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు ఏమాత్రం పొసగడం లేదనేది బహిరంగ రహస్యమే. అల్లు అర్జున్ ను జైలుకు పంపించడం, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడం, దీనికి తోడు నవీన్ యాదవ్‌పై కబ్జా ఆరోపణలు వంటివి కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. కానీ, ఇటీవల కాంగ్రెస్ మంత్రులు సినీ ప్రముఖులతో చర్చలు జరిపి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దమణుగుతుందనే దీమాతో ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం కనీసం సినీ ప్రముఖులతో సంప్రదింపులు కూడా చేపట్టకపోవడంతో వారికి మైనస్ అయ్యే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో మూడ్రోజుల సమయమే మిగిలివుండగా ఇప్పటికైనా టీడీపీ మద్దతు బీజేపీకి ఇస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా టీడీపీ దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చి ఈ కన్ఫ్యూజన్‌కు తెరదించుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
