Commissioner Sudheer Babu: ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీసులే అని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో రెండువేల మంది విద్యార్థినీ, విద్యార్థులు, కాలనీ వాసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ లో ప్రతీ నిమిషానికి రెండు డయల్ 100 ఫోన్ కాల్స్ ను అటెండ్ చేస్తున్నట్టు చెప్పారు. విజబుల్ పోలీసింగ్ ను పెంచినట్టు తెలిపారు.
Also Read: Commissioner Sudheer Babu: నేరాల నియంత్రణకు వీటితో చెక్ పెట్టొచ్చు.. అవేంటంటే!
పోలీసులకు ప్రతీ ఒక్క పౌరుడు సహకారాన్ని అందించాలి
పిల్లలకు దూరంగా ఉంటున్న సీనియర్ సిటిజన్స్ ఇళ్లకు వెళ్లి వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ స్మయిల్ ద్వారా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుననట్టు తెలిపారు. ప్రజల కోసం రేయింబవళ్లు పని చేస్తున్న పోలీసులకు ప్రతీ ఒక్క పౌరుడు సహకారాన్ని అందించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడుకోవటం కోసం ప్రాణాలను సైతం త్యజించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు.
ఎన్బీడబ్ల్యు ఫ్రీ కమిషనరేట్
దేశం మొత్తం మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ నిలిచినట్టు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఈ ఘనత సాధించటంలో సిబ్బంది పాత్ర ఎంతో అభినందనీయమన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నట్టు చెప్పారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ పోలీసులకు అందరూ కృతజ్ఞతగా ఉండాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నట్టుగా ఫ్రెండ్లీ సిటిజెన్ లా ఉండాలని చెప్పారు. మనం ప్రశాంతంగా గుండెలపై చేయి వేసుకుని ఉంటున్నామంటే దానికి కారణం పోలీసులే అని అన్నారు. అనంతరం పోలీసులకు ఎలా సహకరించాలన్న దానిపై కొన్ని పాటలు పాడి వినిపించారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది
సుధీర్ సంద్ర మాట్లాడుతూ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు సాధ్యమైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిదని చెప్పారు. డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీలు పద్మజ, అనురాధ, అక్షాంశ్ యాదవ్, అరవింద్ బాబు, ఇందిర, ఉషారాణి, సునీత రెడ్డి, నరసింహారెడ్డి, రమణ రెడ్డి, శ్రీనివాస్, నాగలక్ష్మి, శ్రీనివాసులు, మనోహర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rachakonda Commissioner: పండుగలకు పటిష్ట బందోబస్తు.. రాచకొండ సీపీ కీలక అదేశాలు!
