Ponnam Prabhakar: ముందస్తు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు సిద్దంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జలమండలి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినా, ఎలాంటి ప్రాణ నష్టం జరగుకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. బుధవారం రోజున ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో వర్షాకాల ప్రణాళిక 90 రోజుల కార్యచరణ, పురోగతిలో ఉన్న పలు ప్రాజెక్టు పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉన్నత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాగునీటి సరఫరా,మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన శుద్ధిచేసిన నీటిని సరఫరా చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. అలాగే సీవరేజ్ రహదారులపై సీవరేజ్ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలాగా చూసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే జలమండలి, జీహెచ్ఎంసీ 146 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించిందని, వాటిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. జలమండలి అధికారులు, సిబ్బంది 90 రోజుల కార్యాచరణ విజయవంతం చేసి, సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులను 30 శాతం తగ్గించడంపై ఎండీతో సహా అందరినీ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ 90 రోజుల ప్రణాళికలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం.. సీఎం సంచలన వాఖ్యలు!
గత ఏడాది వేసవిలో 40 వేల వినియోగదారులు అధికంగా ట్యాంకర్లు బుక్ చేసినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో సర్వే చేస్తే వారి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఇంకుడు గుంతలు ఉంటే భూగర్భ జలాలు పెరిగి ఈ దుస్థితి రాకపోయేదన్నారు. 16 వేల మందికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా నోటీసులు జారీ చేసి చేసినట్టు మంత్రి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని 300 గజాల పైన ఉన్న ప్రతీ నివాసంలో ఇంకుడు గుంతలు నిర్మించడానికి ప్రతి ఒక్కరూ నిర్మించుకోవటాన్ని మస్టు చేయాలని, లేనిపక్షంలో దానిపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జలమండలి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి రెవెన్యూ పెంచుకోవడానికి, నీటి వృధాను అరికట్టడానికి, లీకేజీలను అరికట్టడానికి, ప్రజలలో నీటి వృధా తగ్గించేలా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన, వివిధ శాఖలనుంచి జలమండలికి రావాల్సిన బకాయిలపై ముఖ్య మంత్రితో మాట్లాడుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం బోర్డు తన కాళ్లమీద తాను నిలబడేలాగా అన్నీ రకాలుగా చేయూతనిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్ లను వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దానికనుగుణంగా తాగునీరు, మురుగునీటి శుద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులో భాగంగా రూ.7 వేల కోట్లతో గోదావరి ఫేస్ 2,3 ప్రాజెక్టును పనులను చేపట్టిందని, మురుగునీటి శుద్ధికై 39 ఎస్టీపీలను నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రానున్న 30 ఏళ్ల వరకు నీటి అవసరాలకు భరోసా ఉంటుందని వివరించారు. ప్రజలకు నీటి సరఫరా, మురుగునీటి సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్ 155313 కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్రెడ్డి, కోర్ సిటీ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్ మిషన్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: GHMC street lights: స్ట్రీట్ లైట్ల నిర్వాహణ ప్రైవేట్ పరం.. తేల్చిచెప్పిన జీహెచ్ఎంసీ!