తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Chit Fund Fraud: చిట్టీల పేర జనాన్ని నిలువునా వంద కోట్ల రూపాయల మేరకు ముంచేసిన పుల్లయ్య ఇంట్లో హైదరాబాద్ నేరపరిశోధక విభాగం అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. పుల్లయ్యను వెంటబెట్టుకుని పోలీసులు వచ్చారన్న విషయం తెలిసి అతని వద్ద చిట్టీలు వేసిన పలువురు అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు.
సంజీవరెడ్డినగర్ బీకే గూడ నివాసి పుల్లయ్య వృత్తిరీత్యా మేస్త్రి. మొదట 50 వేలు లక్ష రూపాయల చిట్టీలతో వ్యాపారాన్ని ప్రారంభించిన పుల్లయ్య వాటిని పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు చెల్లిస్తూ నమ్మకాన్ని సంపాదించాడు. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల వరకు చిట్టీలను నిర్వహించాడు. మొదట్లో చిట్టీలు పాడుకున్న వారికి సక్రమంగానే డబ్బులు ఇచ్చిన పుల్లయ్య ఈ తరువాత తన వద్దనే నగదును డిపాజిట్లుగా పెట్టుకున్నాడు. మూడు నుంచి అయిదు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి మొత్తం వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కుటుంబంతో సహా ఉడాయించాడు.
Also Read: Madhurawada Crime: పెళ్లికి అంగీకరించినా.. విశాఖ ప్రేమోన్మాది దాడి.. అసలు నిజం ఇదే..
ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయగా మొదట సంజీవరెడ్డినగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తరువాత వీటిని హైదరాబాద్ నేర పరిశోధక విభాగానికి బదిలీ చేశారు. ఈ క్రమంలో పుల్లయ్య కోసం గాలింపు చేపట్టిన నేర పరిశోధక విభాగం అధికారులు ఇటీవల అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. పుల్లయ్యను వెంటబెట్టుకుని బుధవారం బీకేగూడలోని అతని నివాసానికి వచ్చి తనిఖీలు నిర్వహించారు.
బెంగళూరులో ఆస్తులు…
చిట్టీల పేరుతో వంద కోట్ల రూపాయలకు పైగా జనాన్ని మోసం చేసిన పుల్లయ్య ఆ డబ్బుతో బెంగళూరులో స్థిరాస్తులు కొన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అతని ఇంట్లో సోదాలు జరిపినట్టుగా సమాచారం. తనిఖీల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది.
కాగా, పుల్లయ్యను వెంట తీసుకుని పోలీసులు వచ్చారన్న విషయం తెలిసి అతని వద్ద చిట్టీలు వేసిన వందల మంది అక్కడికి వచ్చారు. తమను నమ్మించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఉన్న బాధితులు ఎక్కడ పుల్లయ్యపై దాడులు చేస్తారోనని భావించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: IPL Betting Addiction: పల్లెలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. నిఘా పెంచిన పోలీస్