Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు దాడికి యత్నించారు. ఓ దొంగ కత్తితో దాడికి తెగబడే యత్నం చేశాడు. అప్రమత్తమైన డీసీపీ.. దొంగలపై కాల్పులు జరిపారు. దీంతో ఓ దొంగ గాయపడగా.. అతడ్ని ఆస్పత్రికి తరలించారు. డీసీపీ చైతన్య క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ సిటీ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీటింగ్ కు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య హాజరయ్యారు. మీటింగ్ అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో.. ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ దొంగిలించి పోరిపోతుండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన డీసీపీ.. గన్ మాన్ తో కలిసి దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిలోని ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో తోపులాట జరిగి డీసీపీ కిందపడిపోయారు.
Also Read: Kavith On BRS: బీఆర్ఎస్‌లో ఎంతో కష్టపడ్డా.. రావాల్సిన గుర్తింపు రాలేదు.. జనం బాటలో కవిత ఆవేదన
వెంటనే తేరుకొని కాల్పులు..
డీసీపీ చైతన్య నేలపై పడిపోవడంతో.. దొంగలు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న డీసీపీ.. తన వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ తో వారిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ దొంగకు తూటా తాకడంతో అతడు గాయపడ్డాడు. మరో దొంగ తప్పించుకోని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన నిందితుడ్ని నాంపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చాదర్ ఘాట్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
