Ranjit Kumar Singh: స్వేచ్ఛాయుత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పారదర్శకంగా జరగాలని ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్అ (Ranjit Kumar Singh)న్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో జిల్లా ఎన్నికల అధికారి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్స్) హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయి రామ్, వివిధ నోడల్ అధికారులు, సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ లను అధికారికంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఎన్నిక ఏర్పాట్లను పరిశీలకులకు వివరించారు.
Also Read: Jubilee Hills By Election: పొలిటికల్ హీట్.. జూబ్లీహిల్స్ ప్రచారంపైనే వాళ్ళ స్పెషల్ ఫోకస్
కమ్యూనికేషన్ ప్రణాళిక, ఫిర్యాదుల పరిష్కార విధానం
ఈ బై ఎలక్షన్ షెడ్యూల్, ముఖ్య తేదీలు, నియోజకవర్గ ప్రొఫైల్, పోలింగ్ స్టేషన్ ల ఏర్పాట్లు, సిబ్బంది మోహరింపు, శిక్షణా కార్యక్రమాలు, ఎన్నికల సామగ్రి కొనుగోలు, రవాణా ఏర్పాట్లు, ఈసీఐ ఐటీ కార్యక్రమాలు, స్వీప్ అవగాహన కార్యక్రమాలు, శాంతి భద్రతలు, వల్నరెబిలిటీ మ్యాపింగ్ కు భద్రతా ప్రణాళిక, ఈవీఎంల నిర్వహణ, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు, మీడియా సమన్వయం, కమ్యూనికేషన్ ప్రణాళిక, ఫిర్యాదుల పరిష్కార విధానం అంశాలను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పరిశీలకులకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లు పట్ల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనరల్ ఆబ్జర్వర్ రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల విధులు జనరల్ డ్యూటీ గా భావించవద్దని, ఇది గురుతర బాధ్యత. ప్రతి అధికారి, సిబ్బంది నిష్పాక్షికంగా, నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.
లిక్కర్, ఇతర వస్తువుల స్వాధీనం పై పరిశీలకులు
ప్రతి దశలో నిస్పాక్షికంగా వ్యవహరించాలని, తటస్థంగా ఉంటూ స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఉంటూ ఎన్నికలు జరిగేలా అందరూ కృషి చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, లిక్కర్, ఇతర వస్తువుల స్వాధీనం పై పరిశీలకులు వివరాలు అడిగి తెల్సుకున్నారు. గత శాసన సభ ఎన్నికలలో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలపై సైతం ఆరా తీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.90 లక్షలు స్వాధీనం కాగా, ఈ బైఎలక్షన్‌లో ఇప్పటివరకు రూ.2.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వారికి వివరించారు. పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి మాట్లాడుతూ బైఎలక్షన్ ప్రాధాన్యత దృష్ట్యా ఈసీఐ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలి
ఎంసీసీ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. శాంతియుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి అధికారి, సిబ్బంది కలిసి చక్కటి సమన్వయంతో పని చేయాలని సూచించారు. వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి రూపాయిని వారి ఖాతాల్లో జమ చేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్స్) హేమంత్ కేశవ్ పాటిల్, జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఏఎస్పీ నర్సింహా రెడ్డి, ఈఆర్ఓ రజనీకాంత్ రెడ్డి, పరిశీలకుల నోడల్ ఆఫీసర్ విల్సన్ తదితరులు హాజరయ్యారు. అనంతరం పరిశీలకులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసును సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
