Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ వింగ్ అధికారులు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్లను వినియోగించే అవకాశముంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 60 మందికి దాటితే బ్యాలెట్ పేపర్ వినియోగించాల్సి వస్తుందన్న ప్రచారాన్ని జిల్లా ఎన్నికల అధికారులు తోసిపుచ్చుతున్నారు. నామినేషన్ల సీకరణ చివరి రోజైన మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కు సుమారు 200 పై చిలుకు నామిషన్ పత్రాలు అందినట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే పలు సెట్ల నామినేషన్లను దాఖలు చేసినా, బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి భారీ ర్యాలీతో వచ్చి మరో సెట్ నామినేషన్ ను సమర్పించారు.
Also Read: Jubilee Hills By Election: ఊహించని రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు..!
త్రిపుల్ ఆర్ రోడ్డు భూ బాధితుల తరపున నామినేషన్లను దాఖలు
కానీ ప్రధాన పోటీ మాత్రం అధికార, విపక్ష పార్టీల మధ్యనే ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా, ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు కొందరు స్వతంత్ర అభ్యర్థులు త్రిపుల్ ఆర్ రోడ్డు భూ బాధితుల తరపున నామినేషన్లను దాఖలు చేశామని, ఇష్టారాజ్యంగా జరుగుతున్న త్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ కేవలం బడా బాబులకు మేలు చేసేలా జరుగుతుందని, ఇందుకు నిరసనగా తాము నామినేషన్లు దాఖలు చేశామని చెప్పుకుంటున్నారు. ఫార్మాసిటీ, త్రిపుల్ ఆర్ భూ బాధితులకు మద్దతుగానే గాక, సుమారు వందకు పైగా స్వాతంత్ర్య అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ మొదలైన ఈ నెల 13వ తేదీ నుంచే పదుల సంఖ్యల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. నేటి నుంచి జరగనున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా ఇలాంటి నామినేషన్లు విత్ డ్రా అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నా, టెక్నికల్ లోపాలతో ఎక్కువ నామినేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
బరిలో ఎంత మంది ఉన్నా ఈవీఎంలే
అభ్యర్థుల సంఖ్య పెరిగితే బ్యాలెట్ పేపర్లను వినియోగించాలన్న నిబంధన ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎన్నికల వింగ్ అధికారులు కొట్టేస్తున్నారు. ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులున్నా, ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందని, ఈ సారి ఈవీఎంలో పొందుపరిచే బ్యాలెట్ లో అభ్యర్థి పేరుతో పాటు కలర్ ఫొటోను డిస్ ప్లే చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఈవీఎం మిషన్ లో 16 మంది అభ్యర్థులను పొందుపర్చే ఛాన్స్ ఉందని, ఇలా ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, వారందరి వివరాలను పొందుపరిచేందుకు అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను వినియోగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఈవీఎంల సంఖ్య, బ్యాటరీల సంఖ్యను పెంచి ఎన్నికల ప్రక్రియ
ప్రతి నాలుగు ఈవీఎంలకు ఓ బ్యాటరీ ఉంటుందని, అభ్యర్థుల సంఖ్యకు తగిన విధంగా ఈవీఎంల సంఖ్య, బ్యాటరీల సంఖ్యను పెంచి ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ సన్నాహాలు చేస్తుంది. నేడు (బుధవారం) జరగనున్న నామినేషన్ల పరిశీలనలో పలు నామినేషన్లు టెక్నికల్ లోపాలతో రిజెక్ట్ అయ్యే అవకాశాలుండగా, ఈ నెల 24వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశమివ్వటంతో ఈ ప్రక్రియలో కూడా చాలా వరకు నామినేషన్ల ఉపసంహర జరిగి, ఫైనల్ గా బరిలో సుమారు 40 నుంచి 60 మంది అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నెల 24న నామినేషన్ల విత్ డ్రా పూర్తయిన తర్వాత ఈ ఉప ఎన్నికకు ఎన్ని ఈవీఎంలను వినియోగిస్తారన్నది క్లారిటీ రానుంది.
Also Read: Jubilee Hills By Election: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవంబర్ 11న గవర్నమెంట్ హలీడే.. ఎందుకో తెలుసా..!
