Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. జూబ్లీలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ (Congress)తో పాటు, విపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే ఈ పార్టీలకు నాన్ – లోకల్ అభ్యర్థుల రూపంలో కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలకు వెళ్లే ఓట్లను గండి కొట్టడమే లక్ష్యంగా నాన్ లోకల్స్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్న తరుణంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఓటర్లను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.
జిల్లాల వారీగా అభ్యర్థులు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మెుత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరితో 36 మంది హైదరాబాద్ కు చెందినవారు కాగా.. మిగిలిన 22 మంది ఇతర జిల్లాలకు (నాన్ – లోకల్స్) సంబంధించిన వారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. బయటి జిల్లాల అభ్యర్థుల్లో కరీంనగర్ నుండి నలుగురు.. నల్గొండ, నిజామాబాద్ ల నుంచి చెరో ముగ్గురు ఉన్నారు. అలాగే ఖమ్మం, యాదాద్రి – భువనగిరి, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల నుండి చెరో ఇద్దరు ఉన్నారు. వీరితో పాటు జనగామ, హనుమకొండ, సంగారెడ్డి, సూర్యపేట జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికల బరిలో నిలిచారు.
వీరిపైనే అందరి దృష్టి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న నాన్ లోకల్ అభ్యర్థుల్లో నలుగురు మాత్రం ప్రధానంగా అందరి దృష్టిని అకర్షిస్తున్నారు. కందరపల్లి కాశీనాథ్ (30) అనే నిరుద్యోగి.. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నారు. జూబ్లీ అభ్యర్థుల్లో అత్యంత విద్యావంతుడైన కాశీనాథ్ (Kasi Nath).. నిరుద్యోగ యువత కోసం తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు గ్రూప్-I, గ్రూప్-II ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని కాశీనాథ్ గుర్తుచేశారు. మరో అభ్యర్థి పూస శ్రీనివాస్.. యాదాద్రి – భువనగిరి జిల్లా నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. ఆయన గంగపుత్ర కమ్యూనిటికి చెందినవారు. జూబ్లీహిల్స్ లో ఈ కమ్యూనిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో వారి మద్దతు పొందటమే లక్ష్యంగా పూస శ్రీనివాస్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నేత సైతం..
జూబ్లీహిల్స్ బరిలో ఉన్న తీటి సుధాకర్ రావు (Theety Sudhakar Rao).. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు. తెలంగాణ రాజకీయాల నుంచి వైసీపీ తప్పుకోవడంతో.. జూబ్లీహిల్స్ లో తాను స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తీటి సుధకాకర్ రావు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఎక్కువ. టీడీపీ సైతం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మూలాలు ఉన్న కారణంగా.. జగన్ సానుభూతిపరులు తనకు ఓటు వేస్తారని సుధాకర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన బోగం చిరంజీవి (Bogam Chiranjeevi) (కరీంనగర్), మంత్రి నరసింహయ్య (Manthri Narasimhaiah) (మహబూబ్ నగర్) తమ వర్గాన్ని ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో 25 శాతం ఎస్సీ ఓట్లు ఉన్న నేపథ్యంలో తమకు మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!
నాన్ – లోకల్స్ పోటీకి కారణమిదే!
తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి ఒక బలమైన కారణమే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన ఓటర్లు అధికంగా ఉన్నారు. సామాజిక, రాజకీయ చైతన్యానికి జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉంది. విభిన్న వర్గాలు, జాతులు.. గత కొన్నేళ్లుగా జూబ్లీహిల్స్ లో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ఇతర జిల్లాల వారు వచ్చి ఇక్కడ బరిలో నిలుస్తున్నట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
