Hydraa: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రకటించిన ప్రతిష్టాత్మక మూసీ సుందరీకరణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా, హైడ్రా మూసీ నదిలో తన చర్యలను ప్రారంభించింది. నగర నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే ఎంజీబీఎస్(MGBS) బస్ స్టేషన్, హైకోర్టు(High Cort), ఉస్మానియా జనరల్ హాస్పిటల్(OU Hospital) వంటి కీలక ప్రాంతాల సమీపంలో మూసీ నదిలో యథేచ్ఛగా కబ్జాలు కొనసాగినట్లు హైడ్రా(Hydraa) గుర్తించింది. కబ్జాదారులు 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి, నదిని రోడ్డుకు సమాంతరంగా మార్చి ఆక్రమణలకు పాల్పడినట్లు హైడ్రా నిర్ధారించింది. ఈ ఆక్రమణలను హైడ్రా మంగళవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 1 గంట కల్లా పూర్తి చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు సమాచారం.
అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట
చుట్టూ ఫెన్సింగ్ వేసి 9.62 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా వెల్లడించింది. వాహనాల పార్కింగ్, పండ్లను నిల్వ ఉంచేందుకు భారీ ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ పేరిట నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీలోని ఉస్మానియా దవాఖాన మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా(Hydraa) తెలిపింది. మూసీ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది. షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆక్రమణలను తొలగించింది.
కేసులున్నా ఆగని కబ్జాలు
తికారం సింగ్(Tikaram Singh) అనే వ్యక్తి 3.10 ఎకరాలు, పూనమ్ చాంద్ యాదవ్(Poonam Chand Yadav) 1.30 ఎకరాలు, జయకృష్ణ(Jayakrishna) అనే వ్యక్తి 5.22 ఎకరాల మేరకు కబ్జా చేసినట్లు హైడ్రా వెల్లడించింది. వీరిపై కోర్టు ధిక్కార కేసులున్నా, కబ్జాలపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినా, కోర్టు ఉత్తర్వులు, పోలీసు కేసులకు సైతం భయపడకుండా కబ్జాలు కొనసాగించినట్లు హైడ్రా నిర్ధారించింది. కబ్జా చేసిన స్థలాన్ని ఎక్కువగా వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నర్సరీని కొంతమేర పెంచి వ్యాపార దందా కొనసాగిస్తున్నట్లు హైడ్రా నిర్ధారించింది. అక్కడ కార్యాలయాల నిమిత్తం చిన్న షెడ్లు కూడా నిర్మించి, ఒక్కో వాహనానికి రోజుకు రూ. 300ల వరకూ వసూలు చేసి బస్సులు, లారీలను పార్కింగ్(Parking) కోసం వినియోగిస్తున్నారని హైడ్రా(Hydraa) తెలిపింది. నది గర్భంలోకి ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేయడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తొలగింపు చర్యలు చేపట్టినట్లు హైడ్రా స్పష్టం చేసింది.
Also Read: CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు
20 మీటర్ల మేర మట్టితో నింపి
మూసీ పరీవాహక ప్రాంతంలో, నదీ గర్భంలో ఏర్పడిన ఆక్రమణలు ఒకటి రెండు రోజుల్లో ఏర్పడినవి కావని హైడ్రా గుర్తించింది. మూసీ నదికి నిజాం కాలంలో రాతితో కట్టిన రిటైనింగ్ వాల్(Retaining wall) స్పష్టంగా ఉంది. నదిలో నుంచి పైన రోడ్డుకు సమాంతరం చేసేందుకు వేలాది లారీలతో మట్టిని, నిర్మాణ వ్యర్థాలను పోసినట్లు హైడ్రా గుర్తించింది. ఇలా దశాబ్దాలుగా మూసీ నది(Musi River)లో మట్టిని పోసి 20 మీటర్లకు పైగా నింపారని, అఫ్జల్‌గంజ్(Afzalganj) రహదారికి సమాంతరంగా నదిని మార్చేశారు. వందల వేలాది బస్సులు, లారీలు పార్కింగ్ కోసం వినియోగిస్తుంటే, వాటిని హైడ్రా ఖాళీ చేయించింది. షెడ్లు వేసుకుని వ్యాపారం చేస్తుంటే వాటిని తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫొటోలు చూస్తే, వాహనాల పార్కింగ్‌తో మూసీ ఎలా నిండి ఉంది, తర్వాత ఎలా ఖాళీ అయ్యిందనేది స్పష్టమౌతుంది.
మూసీ సుందరీకరణతో సంబంధం లేదు
మూసీ సుందరీకరణ పనులతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా స్పష్టం చేసింది. నదిలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడం వరకే హైడ్రా పరిమితమైందని వెల్లడించింది. మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకోవడంపైనే హైడ్రా చర్యలు తీసుకుందని, మూసీ సుందరీకరణ, అభివృద్ధిలో హైడ్రా భాగస్వామ్యం కాదని వివరించింది. ఓఆర్ఆర్(ORR) పరిధిలో నాలాలు, చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాలను తొలగించిన మాదిరిగానే మూసీ నదిలో ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా స్పష్టం చేసింది.
Also Read: Viral Video: విచిత్ర ప్రమాదం.. రివర్స్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు..!