Tanvi Hospital: వైద్యుల నిర్లక్ష్యం పదేళ్ల బాలిక ప్రాణాన్ని బలి తీసుకుంది. దాంతో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన జరిపారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఆస్పత్రి వర్గాలు చనిపోయిన చిన్నారి ప్రాణానికి వెల కట్టింది. బాలిక తల్లిదండ్రులకు 4లక్షల రూపాయలు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సూచించింది. కాగా, మీడియాలో జరిగిన సంఘటనపై వార్తలు రావటంతో వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్థానికంగా కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం బీమనపల్లి గ్రామానికి చెందిన జ్యోతి, శేఖర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె నిహారిక (10) ఉన్నారు.
నిహారిక గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటోంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం నిహారిక 10 రూపాయల నాణంతో ఆడుకుంటూ పొరపాటున దానిని మింగేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వెంటనే నిహారికను వనస్థలిపురం హుడా సాయినగర్ కమాన్ వద్ద ఉన్న తన్వి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు నిహారికకు శస్త్రచికిత్స చేసి 10 రూపాయల నాణాన్ని బయటకు తీశారు. శుక్రవారం ఉదయం నిహారిక పూర్తిగా కోలుకోక ముందే డిశ్చార్జ్ చేశారు. కాగా, అదే రోజు సాయంత్రం నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు కూతురిని నిహారికను తన్వి ఆస్పత్రికి తీసుకొచ్చారు. తమ కూతురిని కాపాడాలని వేడుకున్నారు. అయితే, తన్వి ఆస్పత్రి వైద్యులు నిహారికను చేర్చుకోవటానికి అంగీకరించ లేదు. అరగంట సేపు బతిమాలినా వైద్య సహాయం అందించ లేదు. దాంతో పరిస్థితి విషమించి నిహారిక కన్ను మూసింది.
ఆస్పత్రి ముందు ఆందోళన…
దాంతో నిహారిక తల్లిదండ్రులు, బంధువులు తన్వి ఆస్పత్రి ఎదుట ఆందోళన జరిపారు. ఆపరేషన్ చేసినపుడు అనుభవం లేని డాక్టర్ తో అనస్తీషియా ఇప్పించారని ఆరోపించారు. ఆ కారణంగానే నిహారిక ఆరోగ్య పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. ఆస్పత్రికి తీసుకు వచ్చినా వైద్యం చేయటానికి నిరాకరించారన్నారు. దాంతో సమయం దాటి పోయి పరిస్థితి విషమించి నిహారిక చనిపోయిందన్నారు.
వెలకట్టిన యాజమాన్యం…
నిహారిక తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనతో జరిగిన ఉదంతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో తన్వి ఆస్పత్రి వర్గాలు రంగంలోకి దిగాయి. నిహారిక తల్లిదండ్రులను హాస్పిటల్ లోపలికి పిలిపించుకుని మంతనాలు జరిపాయి. చివరకు 4లక్షల రూపాయలు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని చెప్పి పంపించి వేశాయి. అయితే, అప్పటికే నిహారిక మృతిపై మీడియాలో కథనాలు రావటం మొదలైంది. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసిన పోలీసులు నిహారిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత అందులోని వివరాల ఆధారంగా ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.