Bike Theft:: హై ఎండ్ బైక్ లే ఆ గ్యాంగ్ టార్గెట్. ఎక్కడ పార్క్ చేసి కనిపించినా రెప్పపాటులో కొట్టేసి ఉడాయించటం ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బు కోసం ఈ చోరీలు చేశారనుకుంటే పొరపాటే. తస్కరించిన బైక్ లను ఏ పార్ట్ కా పార్ట్ ఊడదీసి స్వస్థలంలో స్పేర్ పార్ట్స్(Spare parts) షాపు పెట్టాలన్నది వారి పథకం. కాగా, ఓ బైక్ చోరీ కేసులో చాకచక్యంగా దర్యాప్తు జరిపిన మియాపూర్ పోలీసులు(Miyapur Police) గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్(DCP Rithiraj) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన దుర్గా శ్రీనివాస్ సాయికిరణ్ (23), గొట్టపు లీలాసాయి (21), తూర్పోగోదావరికి చెందిన పురంశెట్టి విజయ్ శివసాయి ప్రసాద్ (25), గెడ్డం ప్రవీణ్ (25) స్నేహితులు. అందరికీ కలిసి వ్యాపారం చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడి లేకపోవటంతో చిన్నాచితక నేరాలకు పాల్పడటం మొదలు పెట్టారు. వీటి ద్వారా ఆశించిన డబ్బు చేతికి అందక పోవటంతో హై ఎండ్ బైకులను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
కేటీఎం డ్యూక్ బైక్..
తస్కరించిన వాహనాలను ఏ భాగానాకి ఆ భాగం విడదీసి సొంతూళ్లో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(Automobile spare parts) దుకాణం పెట్టుకోవాలని పథకం వేసుకున్నారు. దాని ప్రకారం హైదరాబాద్(Hyderbada) వచ్చారు. సైబరాబాద్, సంగారెడ్డి(Sangareddy) కమిషనరేట్లలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నుంచి రాత్రుళ్లు ఇండ్లు, అపార్ట్ మెంట్ల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ లను అపహరించటం మొదలు పెట్టారు. ఇలాగే మియాపూర్ లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కేటీఎం డ్యూక్ బైక్ ను ఇటీవల అపహరించారు. ఈ మేరకు ఫిర్యాదు అందగా మియాపూర్ ఏసీపీ శ్రీనివాస రావు(ACP Srinivasa Rao) పర్యవేక్షణలో మియాపూర్ సీఐ శివప్రసాద్, డీఐ రమేశ్ నాయుడు, డీఎస్ఐ నర్సింహారెడ్డి సిబ్బందితో నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.
Also Read: Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?
వరుసగా నేరాలు చేస్తూ..
సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి వాటిని విశ్లేషించటం ద్వారా నిందితులను గుర్తించారు. సోమవారం ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. విచారణలో ఈ గ్యాంగ్ కేపీహెచ్బీ స్టేషన్(KPHP Police Station) పరిధి నుంచి 11, అమీన్ పూర్ స్టేషన్ పరిధి నుంచి 3, చందానగర్ స్టేషన్ పరిధి నుంచి 3, గచ్చిబౌలి స్టేషన్ పరిధి నుంచి 2, మియాపూర్, ఆర్సీపురం స్టేషన్ల పరిధుల్లో నుంచి ఒక్కో బైక్ ను అపహరించినట్టుగా వెల్లడైంది. ఆ తరువాత ఆయా బైక్ ల ఇంజన్, ఛేసిస్ నెంబర్లను మార్చేసినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ముఠా సభ్యుల నుంచి 21 బైక్ లు, టూల్ కిట్ ను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి(DCP Udhay Reddy) అభినందించారు.
Also Read: BJP Telangana: మున్సిపల్ ఎన్నికలపై కమలం కన్ను.. ఈ ఎలక్షన్లు ముగిసాకా జీహెచ్ఎంసీపై ఫోకస్!

