Harish Rao: అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీ కవితను(Kavitha) గులాబీ పార్టీ బయటకు పంపింది. కేసీఆర్ సొంత బిడ్డ అయినా కూడా సస్పెండ్ చేసి గెంటేసింది. అయితే, నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి హరీశ్ (Harish Rao) రావే అని జోరుగా చర్చ జరుగుతున్నది. పార్టీలో ఎవరైనా కీలక నేతగా ఎదిగినా, కేసీఆర్ తర్వాత ఫలానా అనే ప్రచారం జరిగినా టార్గెట్ కావడం ముందు నుంచీ జరుగుతున్నదేననే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ అని రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కేసీఆర్ తర్వాత మరొకరు ఉండొద్దని, అలా ఉంటే ఆయనకు నచ్చదనే ఆరోపణలు ఉన్నాయి. హరీశ్ రావుకు మాస్ లీడర్‌గా పేరు ఉండడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను సైతం ఆకట్టుకోవడం, వారితో మమేకం అవడం తెలుసు. దీనికి తోడు మామలాగే రాజకీయ ఎత్తుగడలు వేయడం లోనూ దిట్ట. ఇదే సమస్యగా మారినట్టు సమాచారం. కవిత మాదిరిగా హరీశ్‌ను కూడా త్వరలోనే పార్టీ బయటకు పంపుతారని తెగ మాట్లాడుకుంటున్నారు.
గతంలో ఎన్నో ఉదాహరణలు
2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత, నాడు హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న ఆలే నరేంద్ర పార్టీలో చేరారు. కీలకంగా పని చేశారు. అయినప్పటికీ కేసీఆర్ ఆయనకు చెక్ పెట్టారు. ఆ తర్వాత కూడ పార్టీలో ఎవరైతే కీలకంగా పని చేసి మంచి గుర్తింపు పొందుతున్నారని తెలియగానే వారిపై వేటు వేస్తూ వచ్చారు. విజయ రామారావు, కేకే మహేందర్ రెడ్డి, విజయశాంతి, గాదే ఇన్నయ్య, చంద్రశేఖర్, జిట్ట బాలకృష్ణారెడ్డి, ఈటల రాజేందర్, తాజాగా కవిత ఇలా అందరూ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్టీలో ఉండి ఎవరైనా సిద్ధాంతాలను వ్యతిరేకించినా, తప్పును తప్పని చెప్పినా, స్వతహాగా ఎవరైనా రాజకీయంగా ఎదుగుతున్నా వారికి కేసీఆర్ చెక్ పెట్టడం ఆనవాయితీగా వస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్లు వింటే తప్ప పార్టీలో కొనసాగడం కష్టమనే ఆరోపణలు సైతం వినిపించాయి.
Also Read: Harish Rao: సభా సాంప్రదాయాలకు కాంగ్రెస్ భంగం.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..!
నెక్స్ట్ హరీశ్ వంతేనా?
హరీశ్ రావుకు(Harish Rao) అటు పార్టీ నేతలు క్యాడర్‌తో పాటు, ఇటు ప్రజల్లోనూ మంచి గుర్తింపు ఉన్నది. కేసీఆర్ (Kcr) తర్వాత హరీశ్ రావే(Harish Rao) అంటూ గతంలో ప్రచారం జరిగింది. దాంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. ఆ తర్వాత విమర్శల నేపథ్యంలో మళ్లీ మంత్రి పదవి ఇచ్చారని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు. అయితే, అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే, మాస్ లీడర్‌గా ఆయన ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేకపోయారు.
హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ గాడిన పడుతుందని పూర్వవైభవం వస్తుందని పలువురు నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హరీశ్ రావు పార్టీలో ఉంటే కేటీఆర్‌కు తగిన గుర్తింపు రాదని, ప్రత్యామ్నాయం లేకుండా చెక్ పెడితేనే బాగుంటుందని అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కవిత బయటకు వెళ్లడంతో ఇక హరీశ్ వంతు వచ్చినట్టేనని తెగ మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే హరీశ్ రావు రాష్ట్రవ్యాప్త పర్యటనకు పార్టీ అధినేత ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజాగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పటికీ ఆయనకు శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారని కేవలం పేరుకే బాధ్యతలు ఇచ్చి చెక్ పెట్టారని ప్రచారం జరుగుతున్నది.
కేసీఆర్ ఆదేశాలతోనే
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను రెండోరోజే వాకౌట్ చేశారు. అసలు ఎందుకు వాకౌట్ చేశారు, చేయాల్సిన అంత అవసరం ఏముంది అనే ప్రశ్నల చుట్టూ ఆరా తీయగా, దీని వెను పెద్ద కుట్ర ఉన్నదని ప్రచారం ఊపందుకున్నది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్ రావు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ, స్పీకర్ మైకు ఇవ్వలేదు. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చి బయటికి వెళ్ళిపోదాం పదా అని తీసుకొని వెళ్ళినట్లు పార్టీ ఎమ్మెల్యేల్లోనే చర్చ జరుగుతున్నది. హరీశ్ రావుకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండానే తీసుకెళ్లారని దీని వెనక అసలు రహస్యం వేరే ఉన్నదని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే హరీశ్ రావును సభలో ఉండకుండా తీసుకెళ్లారని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ మాట్లాడితే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని, అలా చేస్తే కింగ్ మేకర్ అవుతారని, ప్రజల్లో సైతం మరింత ఇమేజ్ పెరుగుతుందని భావించి సభ నుంచి ఈ సెషన్ వాకౌట్ చేయించారని అనుకుంటున్నారు. హరీశ్ రావుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా అధిష్టానం నిర్ణయాలు ఉంటున్నాయని బీఆర్ఎస్ నేతలే తెగ మాట్లాడుకుంటున్నారు.
Also Read: Harish Rao: కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ.. రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్!

