Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని తన ‘మార్పు’గా చూపిస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ద్వంద్వ వైఖరిని, అనైతిక విధానాలను ఎండగడుతూ ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంప్రదాయాలు, విలువలు అంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2016 మార్చి 30న స్పీకర్‌కు రాసిన ఉత్తరాన్ని హరీశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also Read: Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!
విలువలకు తిలోదకాలు
‘అసెంబ్లీలో ఆడియో, విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారతదేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము అని మీరు సంతకం చేసిన ఉత్తరం గుర్తుందా? లేదా? అదే ఉత్తమ్ నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్‌కు సిద్ధపడటం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఈ ఉత్తరంపై నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పద్మావతి కూడా సంతకాలు చేశారు., కాంగ్రెస్ అనైతికతను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క ఉత్తరం చాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్ఫూర్తి లాంటి మాటలు వల్లెవేసి, అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇవ్వడం కాంగ్రెస్ అసలు నైజం. అధికార పక్షానికి ప్రెజెంటేషన్‌కు అనుమతి ఇచ్చినప్పుడు, బీఆర్ఎస్‌కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను బీఏసీ సమావేశంలో కోరినా తిరస్కరించారు. ఇదే కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మధ్య ఉన్న తేడా. ఆ మార్పు అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు’ అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
Also Read; Crime News: ముఖ్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహణం బైక్ ఢీకొని స్పాట్‌లో యువకుడు మృతి

